తెలంగాణపై కేంద్రం వివక్షత గురించి ప్రస్తావించిన కేటీఆర్

గత కొద్దీ రోజులుగా తెలంగాణ సర్కార్ vs కేంద్రం వార్ నడుస్తుంది. ప్రతి విషయంలోనూ కేంద్రం తెలంగాణను చిన్న చూపు చూస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక మంత్రి కేటీఆర్..ట్విట్టర్ ద్వారా కేంద్రం ను ప్రశ్నిస్తూ వస్తున్నారు. మరోసారి తెలంగాణపై కేంద్రం వివక్షత గురించి ట్విట్టర్ ద్వారా ప్రస్తావించారు.

గ్లోబ‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ ట్రెడిషిన‌ల్ మెడిసిన్ కేంద్రాన్ని హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ భావిస్తోంద‌ని, ఈ సెంట‌ర్‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల.. అది న‌గ‌రాన్ని, రాష్ట్రాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని గ‌తంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి త‌న ట్వీట్‌లో తెలిపారు. అయితే ఇప్పుడు ఆ సెంట‌ర్ జామ్‌న‌గ‌ర్‌కు వెళ్ల‌డంతో కిష‌న్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ సెటైర్ వేశారు.

సంప్ర‌దాయ వైద్య కేంద్రాన్ని మంత్రి కిష‌న్ రెడ్డి రాష్ట్రానికి తీసుకువ‌చ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లే చెప్పిన మంత్రి కేటీఆర్‌.. కాస్త ఆగండి.. గుజ‌రాత్ ప్ర‌ధాని ఆ కేంద్రాన్ని జామ్‌న‌గ‌ర్‌కు తీసుకువెళ్లిన‌ట్లు త‌న ట్వీట్‌లో కేటీఆర్ విమ‌ర్శించారు. తెలంగాణ రాష్ట్రంపై ప్ర‌ధాని మోదీ వివ‌క్ష ఓ ధారావాహికంలా సాగుతోంద‌ని, తెలంగాణ‌కు నిరాటంకంగా అన్యాయం జ‌రుగుతున్న‌ట్లు మంత్రి కేటీఆర్ ఆరోపించారు.

కేంద్రం 7 ఐఐఎంలు, 7 ఐఐటీలు కేటాయిస్తే వాటిలో తెలంగాణకు అన్యాయం జరిగింది కేటీఆర్ అన్నారు. ఐఐఎస్ఈఆర్ లు 2 కేటాయిస్తే తెలంగాణకు ఏం ఇవ్వలేదని అన్నారు. 16 ఐఐటీల్లో రాష్ట్ర ఊసేలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్ ఐడీలు 4, మెడికల్ కాలేజీలు 157 కేటాయిస్తే ఒక్కటి కూడా తెలంగాణకు కేటాయించలేదని… ఇలాగే 84 నవోదయాల్లో తెలంగాణకు ఒక్కటీ కూడా ఇవ్వలేదని ట్విట్ చేశారు. రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ హామీని కేంద్రం విస్మరించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు.