బాసర విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు అందజేసిన మంత్రి కేటీఆర్

బాసర ట్రిపుల్‌ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, యూనిఫాంలు అందజేశారు. హాస్టల్‌ బిల్డింగ్‌పై సోలార్‌ ప్లాంటును మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. అదేవిధంగా మంత్రుల సమక్షంలో టీహబ్‌ ప్రతినిధులు ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

ఉన్నత ఉద్యోగం సాధించాలనుకోవడం సరే కానీ మరో పదిమందికి ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని, కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించాలని విద్యార్థులకు మంత్రి కేటీఆర్ సూచించారు. తన ప్రసంగంలో హైదారాబాద్ లో ఏర్పాటు చేసిన టీహబ్ ను ప్రస్తావించిన మంత్రి.. బిల్డింగ్ కట్టినపుడు ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారని గుర్తుచేశారు.

ఇటీవల అంతరిక్షంలోకి పంపిన తొలి రాకెట్ ను తయారుచేసిన ‘స్కైరూట్’ కంపెనీ తొలుత టీహబ్ లోనే మొదలైందని చెప్పారు. ధృవ స్పేస్ కంపెనీ కూడా టీహబ్ లోనే పురుడు పోసుకుందని మంత్రి వివరించారు. ఇలాంటి కొత్త కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచించి, స్టార్టప్ లు ప్రారంభించాలని విద్యార్థులకు మంత్రి పిలుపునిచ్చారు.

గతంలో హామీ ఇచ్చినట్లుగా యూనివర్శిటీ విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, డెస్క్ టాప్ లు అందజేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాంఛనంగా కొంతమంది విద్యార్థులకు ఈ కార్యక్రమంలోనే అందజేస్తామని, మిగతా వారికి ఒకటి రెండు రోజుల్లో అందిస్తామని చెప్పారు. ఇందుకోసం మొత్తం 2,200 ల్యాప్ టాప్ లు, 1500 డెస్క్ టాప్ లు తెప్పించినట్లు మంత్రి వివరించారు. కొత్త ఆడిటోరియం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. అలాగే ఆర్జీయూకేటీ అధికారులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏమైనా అంతరిక్ష సమస్యా అని నిలదీశారు. గతంలో తామిచ్చిన హామీల అమలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు.