జేపీ నడ్డాపై కెటిఆర్‌ విమర్శలు

మోడీ బిజెపి రాష్ట్రాల్లో గొడవ ఆపలేదు కానీ.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఆపారా..

minister ktr

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. గొప్పల కోసం బిజెపి నేతల చెప్పుకుంటున్న బడాయి మాటలను ఎండగట్టారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై వాస్తవాలను బయటపెట్టారు.

బిజెపి పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర మధ్య నెలకొన్న బెలగావి సరిహద్దు సమస్యను ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోడీ పరిష్కరించలేకపోయాడని కెటిఆర్‌ తెలిపారు. కానీ రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని మాత్రం ఆపారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోడీ ఆపారనేది అవాస్తవమని వాళ్ల నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే వెల్లడించిందని గుర్తు చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో మోడీని ప్రశంసిస్తూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏఎన్‌ఐలో ప్రచురితమైన ఓ కథనాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఔర్‌ కిత్నా ఫేకోగె సర్ ( ఇంకా ఎన్ని అబద్దాలు చెబుతారు సార్‌ ) అంటూ సెటైర్‌ వేశారు.