ద్రౌపది ముర్ముకు మంత్రి కేటీఆర్‌ అభినందనలు

భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ఘనవిజయం సాధించి 15 వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ద్రౌపది ముర్ముకు తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. భారత 15 వ రాష్ట్రపతి గా ద్రౌపదీ ముర్ము ఎన్నికయ్యారు. ప్రత్యర్థి యశ్వంత్​ సిన్హాపై భారీ మెజార్టీతో విజయం సాధించి , భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా బిజెపి శ్రేణులు , ద్రౌపదీ ముర్ము కు మద్దతు పలికిన నేతలు , ఆదివాసులు సంబరాలు చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సోషల్ మీడియా ద్వారా ద్రౌపదీ ముర్ము కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా కేటీఆర్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్‌ బిల్లు, గిరిజనుల రిజర్వేషన్ల బిల్లు, అటవీ హక్కుల చట్ట సవరణ బిల్లు తమ హయాంలో ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఇక ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక నిన్న ప్రధాని మోడీ ద్రౌపదీ ముర్ము ఇంటికి వెళ్లి అభినందనలు తెలుపగా , కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముర్ముకు అభినంద‌న‌లు తెలిపి ఆమెకు మిఠాయి తినిపించారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ముర్ము నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24తో ముగుస్తుంది. నూతన రాష్ట్రపతి గా ద్రౌపదీ 25న ప్రమాణస్వీకారం చేయనున్నారు.