ఈటెల తండ్రి మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ సంతాపం

బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తండ్రి మల్లయ్య (104) అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మల్లయ్య మృతి పట్ల టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం తెలియజేసారు. ఈట‌ల మ‌ల్ల‌య్య మృతి బాధాక‌ర‌మ‌న్న కేటీఆర్‌… ఈటల రాజేంద‌ర్‌కు, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈట‌ల మ‌ల్ల‌య్య ఆత్మకు శాంతి చేకూరాల‌ని కూడా కేటీఆర్ కోరారు. ఈ ట్వీట్ చేసిన వెంట‌నే కేటీఆర్‌కు థ్యాంక్స్ చెబుతూ రాజేంద‌ర్ రీ ట్వీట్ చేశారు.

గత కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న మ‌ల్ల‌య్య ఆర్‌వీఎం ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ.. మంగ‌ళ‌వారం తుదిశ్వాస విడిచిన సంగ‌తి తెలిసిందే. కాగా మల్లయ్యకు ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుర్లు ఉన్నారు. ఈట‌ల రాజేంద‌ర్ రెండో కుమారుడు. మ‌ల్ల‌య్య అంత్య‌క్రియ‌లు బుధ‌వారం మ‌ధ్యాహ్నం ముగిశాయి.

ఇక ఈటెల రాజకీయాల విషయానికి వస్తే…టిఆర్ఎస్ నుండి బయటకు వచ్చిన రాజేందర్..బిజెపి పార్టీ లో చేరి , హుజురాబాద్ నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. రాజేందర్ సతీమణి జమున స్వగ్రామం మునుగోడు నియోజకవర్గంలోనే ఉండటంతో.. ఆయన అక్కడే స్వయంగా అక్కడే ఉండి.. ఉపఎన్నిక కోసం పనిచేస్తున్నారు.