బండి సంజయ్ పాదయాత్ర ఫై కేటీఆర్ కామెంట్స్

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గత కొద్దీ రోజులుగా ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం , సాయంత్రం వేళల్లో రోజుకు 13 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ..ప్రజల కష్టాలు అడిగితెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో సంజయ్ యాత్ర ఫై తెరాస నేతలు పలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ బండి సంజయ్కు సవాల్ విసిరారు. దమ్ముంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.

ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రైవేట్ విద్యాసంస్థలను రద్దుచేసే విధంగా చర్యలు తీసుకుంటే టీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో బండి సంజయ్ ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఏ మొఖం పెట్టుకుని పాలమూరులో బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వనందుకు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. మతపిచ్చి రెచ్చగొట్టడం.. పిల్లల్ని చెడగొట్టడమే బీజేపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు.