తన కారుకు చలాన్ వేసిన ఎస్ఐని సన్మానించిన కేటీఆర్

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ కారుకు ట్రాఫిక్ ఎస్ ఐ చ‌లాన్ విధించిన సంగతి తెలిసిందే. అక్టోబ‌రు రెండోతేదీన రాంగ్ రూట్‌లో వ‌చ్చినందుకు చ‌లాన్ విధించారు. ఈ చలాన్ విధించిడం పట్ల చాలామంది హర్షం వ్యక్తం చేయగా..కొంతమంది ఎస్ ఐ ఫై మండిపడ్డారు. అయితే కేటీఆర్ మాత్రం చలాన్ వేసిన ఎస్ఐ ని సన్మానించి దటీజ్ కేటీఆర్ అనిపించుకున్నారు.

కొందరు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు తాము చట్టానికి, నిబంధనలకు అతీతమని భావిస్తుంటారు. ఎవరైనా తమకు ఎదురుగా వచ్చిన..తప్పని ప్రశ్నించిన బదిలీ చేయించడమో, సస్పెండ్ చేయడమే చేస్తుంటారు. అయితే తెలంగాణ మంత్రి కేటీఆర్ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తించారు.

రాంగ్ రూట్‌లో వచ్చినందుకు కేటీఆర్‌ కారుకు ఎస్ఐ ఐలయ్య జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ ఎస్ఐ ఐలయ్యను సోమవారం తన ఛాంబర్‌కు పిలిపించుకుని అభినందించారు. సామాన్యులైనా, సెలబ్రెటీలైనా, అధికారంలో ఉన్నవారైన ట్రాఫిక్ నిబంధనలు ఒక్కటేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, అయితే ట్రాఫిక్ పోలీసులు చలాన్ విధించిన రోజు వాహనంలో తాను లేనని కేటీఆర్ అన్నారు. విధి నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన ఎస్ఐ, కానిస్టేబుల్‌ను అభినందిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు