పాలమూరు ప్రాజెక్ట్ కు ఈ 8 ఏండ్ల‌లో 8 పైస‌లు కూడా ఇవ్వ‌లేద‌ని కేటీఆర్ విమర్శ ‌

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ..శనివారం మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. భూత్పూర్‌ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. ఆ త‌ర్వాత అమిస్తాపూర్‌లో జ‌రిగిన‌ బహిరంగ సభలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రానికి తెలంగాణ రూ.3.65లక్షల కోట్లు ఇస్తే.. కేంద్రం తెలంగాణ‌కు రూ.1.68లక్షల కోట్లు మాత్రమే ఇచ్చింది.. తాను చెప్పింది నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్న కేటీఆర్‌.. బీజేపీ చెప్పింది తప్పయితే అమిత్ షా ముక్కు నెలకు రాస్తారా? అని సవాల్‌ విసిరారు.

దేశంలోనే అత్యంత దుర్భిక్షం ఉన్న జిల్లా పాల‌మూరు జిల్లా అని పేర్కొన్న కేటీఆర్‌… పాల‌మూరు జిల్లా స‌స్య‌శ్యామ‌లం కావాలని కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. అయితే ఈ య‌త్నాల‌ను కొంద‌రు దుర్మార్గులు అడ్డుకుంటూ సైంధ‌వ పాత్ర పోషిస్తున్నారని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

అమ్మ పెట్ట‌దు…అడుక్కు తిన‌నివ్వ‌దు అన్న‌ట్లుగా తెలంగాణ ప‌ట్ల న‌రేంద్ర మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేటీఆర్ ఆరోపించారు. పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామ‌ని దేవ‌ర‌క‌ద్ర‌లో మోదీ న‌మ్మ‌బ‌లికారని గుర్తు చేసిన కేటీఆర్‌… ఇదే విష‌యంపై హైద‌రాబాద్‌లోనూ నాటి బీజేపీ కేంద్ర మంత్రి సుష్మా స్వ‌రాజ్ కూడా ప్ర‌క‌ట‌న చేశార‌న్నారు. అయినా కూడా ఈ 8 ఏండ్లలో కేంద్రం నుంచి పాల‌మూరు ప్రాజెక్టుల‌కు క‌నీసం 8 పైస‌లు కూడా విడుద‌ల కాలేద‌న్నారు. క‌ర్ణాట‌క‌లోని అప్ప‌ర్ భ‌ద్ర‌కు జాతీయ హోదా ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణ మీద ప్రేమ ఉంటే తెలంగాణ‌ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ ప్ర‌శ్నించారు.

వికారాబాద్‌ – కర్నాటక, గద్వాల – మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. కృష్ణానదిలో తెలంగాణకు 575 టీఎంసీల నీటివాటా ఇవ్వడంలో కేంద్రం తాత్సారం చేస్తుందని ఆరోపించారు. పాలమూరులో 8లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకనే పాలమూరులో వలసలు తగ్గాయని గుర్తు చేశారు. మంచి మంచి సంక్షేమ పథకాలతో పేదలకు ప్రభుత్వం అండగా ఉన్నదన్నారు.