మునుగోడు ఉప ఎన్నిక ఫై కేటీఆర్ కామెంట్స్

మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి , కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేయడం తో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ ఉప ఎన్నికపై కాంగ్రెస్ పార్టీ ప్రచారం మొదలుపెట్టగా..ఈ నెల 21 న బిజెపి తీర్థం పుచ్చుకొని రాజగోపాల్ తన ప్రచారాన్ని మొదలుపెట్టబోతున్నారు. ఇదిలా ఉంటె ఈ ఉప ఎన్నికల ఫై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ , మంత్రి కేటీఆర్ స్పందించారు.

మునుగోడు ఒక అసెంబ్లీ స్థానానికి జరగబోయే ఉప ఎన్నిక మాత్రమే.. ఆ ఎన్నికతో మారేదేం ఉండదు. అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ తెలంగాణ కేసీఆర్‌ది. ప్రజల ఆశీర్వాదంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రభుత్వం మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్‌ సాధిస్తుంది’’ అని అన్నారు. శుక్రవారం ట్విటర్‌లో నెటిజన్లు అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నిక ఫై ప్రశ్నించగా ఈ సమాధానం ఇచ్చారు.

మరోపక్క కేసీఆర్ ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర నేతలతో కేసీఆర్‌ వరుసగా భేటీ అవుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, నల్గొండ జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డి.రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. రెండు విడతలుగా సుమారు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో.. ఉప ఎన్నికకు సంబంధించి క్షేత్రస్థాయిలో సేకరించాల్సిన సమాచారం, అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ దిశా నిర్దేశం చేసినట్టు తెలిసింది.

హడావుడిగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లకుండా పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించినట్టు సమాచారం. హుజూర్‌నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాలు, ఎత్తుగడలు, వాటి ఫలితాలను ప్రస్తావిస్తూ.. మునుగోడులో ఎలా ముందుకు సాగాలనే అంశంపై వారు సుదీర్ఘంగా మాట్లాడుకున్నట్టు తెలిసింది.