అగ్నిప‌థ్ స్కీమ్‌ను పున‌:సమీక్షచాలంటూ కేంద్రానికి కేటీఆర్ సూచన

కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్ స్కిం పట్ల దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. దీనిని వెంటనే వెనక్కు తీసుకోవాలంటూ గత నాల్గు రోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఆందోళనలు చేస్తున్నారు. రైల్వే స్టేషన్ లను టార్గెట్ గా చేసుకొని దాడులు చేస్తున్నారు. బీహార్ , రాజస్థాన్ , యూపీ తో పాటు పలు నగరాల్లో విధ్వసం సృష్టించగా , ఈరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున ఆర్మీ విద్యార్థులు చేరుకొని హింసాత్మక ఘటనలు చేసారు. రైళ్లు తగలపెట్టారు. స్టేషన్ ను పూర్తిగా ధ్వసం చేసారు. అలాగే పోలీసుల కాల్పుల్లో ఓ యువకుడు సైతం ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనల పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ ..కేంద్రానికి అగ్నిప‌థ్ స్కీమ్‌ను పున‌:సమీక్షచాలంటూ డిమాండ్ చేసాడు. దేశానికి సేవ చేస్తూ, ఆర్మీ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది యువత ఆశలను వంచించే విధంగా కేంద్ర నిర్ణయం ఉండాల‌ని టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయ‌ప‌డ్డారు. వివాదస్పద అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకంపై ఆందోళనలు కొనసాగుతున్న తీరు దేశంలో పేరుకుపోయిన నిరుద్యోగ సమస్య తీవ్రతకు నిదర్శనమ‌ని ఆయ‌న పేర్కొన్నారు. నిరుద్యోగ యువ‌తో కేంద్రంపై ఉన్న ఆగ్ర‌హానికి ఈ ఆందోళ‌న‌లు అద్దం ప‌డుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. అత్యధికంగా అర్మీలో చేరే గ్రామీణ ప్రాంత యువతకు అగ్నిప‌థ్ స్కీమ్ తీరని నష్టం క‌లిగిస్తుంద‌న్నారు. ఇప్ప‌టికైనా కేంద్రం క‌ళ్లు తెరిచి ఈ విధానాన్ని వెంట‌నే వెన‌క్కి తీసుకోవాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిరసనలోయువకుడి మృతి పట్ల కేటీఆర్ ఆవేదన వ్య‌క్తం చేశారు. ఆ యువ‌కుడి మృతికి కేంద్ర‌మే బాధ్య‌త వ‌హించాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు.

జై జవాన్-జై కిసాన్ అని నినదించిన ఈ దేశంలో.. మెన్నటిదాకా నల్ల రైతు చట్టాలతో రైతుల గోసపుచ్చుకున్న కేంద్రం, ఇప్పుడు అగ్నిప‌థ్‌తో జవాన్లను నిర్వేదంలోకి నెడుతున్నదని కేటీఆర్ పేర్కొన్నారు. వన్ ర్యాంక్-వన్ పెన్షన్ నుంచి ఆర్మీని ఈ రోజు నో ర్యాంక్ –నో పెన్షన్ స్థాయికి దిగజార్చిందని కేటీఆర్ విమర్శించారు. దేశవ్యాప్తంగా పెల్లుబుకుతున్న యువత ఆగ్రహానికి, ఆందోళనలకు కేంద్రానిదే పూర్తి బాధ్యత అన్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అనే విషయాన్ని మరిచి ఏకపక్షంగా, నియంతృత్వం మాదిరి ఇలాంటి చర్చలు లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్లనే ప్రజలకు ఇన్ని కష్టాలు వస్తున్నాయని కేటీఆర్ అన్నారు.