క్షత్రియ ధర్మం

ఆధ్యాత్మిక చింతన-

Kshatriya Dharmam
Kshatriya Dharmam

ద్రోణాచార్యుడు కౌరవులకు, పాండవులకు గురువు. అతనికి ఈ అన్నదమ్ముల కుమారుల యందు సహజమైన వాత్సల్యముండేది.

దుర్యోధనుడు అకృత్యాలు చేస్తూ ఉంటే మందలించేవాడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవు లవైపు ఉన్నా కూడా పాండ వుల మీద ఎక్కువ ప్రేమ చూపించేవాడు.

కాని ద్రోణుని కుమారుడు అశ్వత్థామ మాత్రం సంపూర్ణంగా కౌరవుల పక్షపాతి. పాండవుల ధర్మపరాయణం అతను ఎంతమాత్రం లెక్కచేసేవాడు కాదు. భారత సంగ్రామంలో 18వ రోజు దుర్యోధనుడికి తొడలు విరిగి నేలపడ్డాయి.

అలాంటి సమయంలో ధృతరాష్ట్రుడికి సంతోషం కలిగించాలని అశ్వత్థామ తీవ్రంగా ఆలోచించాడు. ఇది ధర్మము ఇది అధర్మము అని తెలుసుకోకుండా రాత్రి అందరూ నిద్రించే సమయంలో పాండవుల శిబిరంలో అశ్వత్థామ దూరి ద్రౌపది పుత్రులు అయిదుగురిని హతమార్చి, వారి శిరస్సులను తెచ్చి దుర్యోధనునిని సమర్పించాడు.

ఈ ఘోరకృత్యం చూసి పాంచాలి పంచశిశువులు మరణించడం చూసి ఘోరంగా విలపించింది.

అర్జునుడు భార్యను ఓదార్చుతూ ప్రియా! వీరవనితయైన నీవు ఏడ్వకూడదు. క్షత్రియధర్మం ప్రతీకారం ఆలోచిస్తాను. నేనిప్పుడే పోయి అశ్వత్థామ బ్రహ్మ బంధువ్ఞ అని దూషించాడు.

బ్రహ్మ బంధువు అంటే సద్బ్రాహ్మణునికి జన్మించినా కూడా బ్రాహ్మణులకు ఉండవలసిన దయ, దాక్షిణ్యము, వివేకం లేకుండా అధముడైనటువంటి వాడని అర్ధము. వర్ణాశ్రమ ధర్మాలు ఏవీ కూడా చేసేవాడు కాదు.

ఇంకా కూడా ఆకతాయి దూషించాడు. అవి ఏమంటే 1. అగ్నిలో హింసించటం. 2. విషాన్ని ఇవ్వటం. 3. అకారనంగా కత్తితో పొడవటం. 4. ధనమును హరించటం 5. భూమిని హరించటం 6. భార్యను హింసించటం. ఈ ఆరు దుష్కర్మలు. కులంతో సంబంధం లేకుండా ఎవరు చేసినా పాపములే. ఇక్కడ అశ్వత్థామ ఆకతాయితనం నిరూపించబడింది.

అందుకని ఆయనను క్షత్రియధర్మం ప్రకారం చంపుతానని బయలుదేరాడు. రథంపై ఎక్కి వస్తున్న గాంఢీవిని చూసి అశ్వత్థామ తన తప్పు తెలుసుకుని ఆదుర్డాగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. అయినా అర్జునుడు సమీపమునకు రాగానే అశ్వత్థామ వేరే మార్గంలేక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అశ్వత్థామకు అస్త్రప్రయోగం తెలుసుగానీ, ఉపసంహరించడం తెలియదు.

ఉపసంహారం తెలీకుండా అస్త్రం ప్రయోగించటం కూడదని యుద్ధనియమం. అంతేకాకుండా బ్రహ్మశిరోనామఅస్త్రము మానవ్ఞలపై ప్రయోగించరాదనేది మరో నియమము. ఈ రెండు నియమాలను వ్యతిరేకించి తన ఆకతాయితనం నిరూపించుకున్నాడు. కృష్ణపరమాత్మ అర్జునునితో భీభత్సా! నీ బ్రహ్మాస్త్రంతోగాని దీని మరలింపరాదా అన్నాడు

. బ్రహ్మాస్త్రం బ్రహాస్త్రం పైనే గానీ అశ్వత్థామ పైన కాదు. అర్జునునికి అస్త్రసంహారం బాగా తెలుసు. ఇందులో నియమ ఉల్లంఘనం ఏమీ లేదు.

పార్థుడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. రెండు బ్రహ్మాస్త్రాలు దేదీప్యమానంగా ఆకాశంలో వెలుగుతూ యావద్భూమి అంతా కంపించిపోయింది. ఉత్పాతకాలు కలుగకుండా హరి ఆజ్ఞచే అర్జునుడు రెండు బ్రహ్మాస్త్రాలు ఉపసంహరించుకున్నాడు.

నిర్వీర్యుడైనటువంటి అశ్వత్థామను అర్జునుడు బంధించి తన శిబిరానికి ఈడ్చుకుని వెళ్లాడు. పశువ్ఞ మాదిరి త్రాటితో ఈడ్చుకుని వచ్చిన అశ్వత్థామను చూసి, మృధుభాషి అయిన ద్రౌపది గురుపుత్రునికి నమస్కరించింది.

పశుప్రవృత్తితో తన అయిదుగురు కొడుకులను హతమార్చిన ఘాతకుని కూడా గురుపుత్రుడని మరొకసారి నమస్కరిస్తూ పుత్రుల మరణంలో నేననుభవిస్తున్న శోకము వ్యాకులత అశ్వత్థామ తల్లి కృషికి సంభవించకూడదు.

తనకేది కష్టము కలిగిస్తుందో అది ఆ కష్టము ఇతరులకు కలుగకూడదు అని మృదువుగా అర్జునుని వేడుకుంది. ఇక్కడ ద్రౌపది స్త్రీ హృదయం ఎంత ఉదారంగా ఉన్నతంగా ఉందో మనం గ్రహించవలసి ఉంది. విపరీతమైన దుఃఖంలో కూడా ఆ భావం పెల్లుబకటం పాంచాలికే తగింది.

నకులసహదేవులు, ధర్మరాజు, కృష్ణుడు మేలుమేలు అని ప్రశంసించారు. భీముడికి మాత్రం ఈ మాటలు గిట్టలేదు. పిడికిటిపోటుతో అశ్వత్థామ శిరము నూరు ముక్కలు చేస్తానని ముందడుగు వేశాడు. ద్రౌపది సున్నితంగా వారించింది.

ద్రౌపది ధర్మవాక్కులు భీముని కరకువాక్కులు విని కృష్ణుడు రెండు చేతులతో భీముని రెండు చేతులతో ద్రౌపదిని దూరం చేసి వివాదం ఆపివేశాడు.

కృష్ణుడు అర్జునుని వారించాడు కానీ అర్జునుడు అశ్వత్థామ తలవెంట్రుకలు కత్తిరించి ఆ తలలో ఉండే మణిని తీసుకుని బంధాలను విడిపంచి భీముని తృప్తిపరచి, చంపక వదిలివేయటం తక్కిన పాండవులకు సమ్మతంగా భావించి, శిబిరం నుండి బయటకు త్రోసివేశాడు అశ్వత్థామను.

  -ఉలాపు బాలకేశవులు 

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/