రేపు ఉదయం మహా ప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు రేపు (నవంబర్ 16) ఉదయం మహా ప్రస్థానంలో జరగనున్నాయి. 80 ఏళ్ల కృష్ణ సోమవారం తెల్లవారు జామున గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ చేర్పించారు. కానీ చికిత్స పొందుతూనే ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. దీంతో కృష్ణ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. విషయం తెలిసిన అభిమానులు, తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రస్తుతం కృష్ణ భౌతిక దేహాన్ని కాంటినెంటల్ హాస్పటల్ నుండి నానక్ రామ గూడ లోని ఆయన స్వగృహానికి తరలిస్తున్నారు. మధ్యాహ్నం గచ్చిబౌలి లోని స్టేడియం లో అభిమానుల సందర్శనార్థం ఉంచుతారు. రేపు ఉదయం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నారు.

కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు. కృష్ణ అసలు పేరు ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి. కృష్ణ డిగ్రీ చదువుతున్నప్పుడు ఏలూరులో అక్కినేని నాగేశ్వరరావుకు ఘనంగా సన్మానం జరిగింది. అది చూసిన కృష్ణ సినిమాలపై మోజు పెంచుకున్నారు. దీంతో ఆయన సినీ రంగానికి వచ్చేశారు. 1965లో ఆయన ఇందిరను వివాహం చేసుకున్నారు. వీరికి రమేశ్ బాబు, మహేశ్‌బాబు, పద్మావతి, ప్రియదర్శిని, మంజుల సంతానం. ఆ తర్వాత విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు.