అశ్వత్థామకు కృష్ణుని శాపం

శ్రీ కృష్ణ లీలలు

Krishna’s curse to Ashwatthama’

అశ్వత్థామ అడవులలలో తిరుగుతున్నాడు. ఆకలి వలన అతని కడుపులో ప్రేగులు నకనకలాడుతున్నాయి. పండ్లేమన్నా లభిస్తాయేమోనన్న దృష్టితో అడవిలోని చెట్లన్నిటినీ పరిశీలించాడు. అతనికి ఒక పండు కూడా లభించలేదు. కడకు ఒక మామిడిచెట్టు కింద రెండు మామిడి పండ్లు పడి ఉన్నాయి.

అశ్వత్థామ గబగబా పండ్ల దగ్గరకు వచ్చాడు. అతను పండ్లను సమీపించేటంతలో ఒక పాము రెండు పండ్లను కాటేసి విషపూరితం చేసి వెళ్లింది. అశ్వత్థామకు శ్రీకృష్ణుని శాపం గుర్తుకు వచ్చింది. ‘బాలఘాతీ నీవు తిండి ఆహారం దొరకకుండ మలమలమాడుతూ చెడు వాసన గల రక్తంతో దేహం తడిసిపోతూ మూడువేల సంవత్సరాలు దిక్కుమాలినవాడివై తిరుగెదవు గాక అని.

అశ్వత్థామ కళ్లలో నీళ్లు దొర్లాయి. వ్యాస భగవానుని మాటలు వినకుండా శ్రీకృష్ణ భగవానుని హితోక్తులను పెడచెవిన పెట్టి ఉపసంహరించడం చేతకాని బ్రహ్మ శిరోనామాస్త్రమును ప్రయోగించిన తన అహంకారాన్ని అశ్వత్థామ దూషించుకున్నాడు. నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. బ్రహ్మ శిరోనామాస్త్రం మహత్తరమైనది.

అస్త్రాన్ని ప్రయోగించిన వారే దానిని ఉపసంహరించాలి. లేకుంటే 12 సంవత్సరాలు అనావృష్టి కలుగుతుంది. ఉపసంహరణ తెలియని అశ్వత్థామ బ్రహ్మ శిరోనామాస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుని మాట విని అర్జునుడు కూడ అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. శ్రీకృష్ణుని మాటని అనుసరించి అర్జునుడు కూడ అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడే శ్రీకృష్ణుడు అశ్వత్థామని శపించగా వ్యాసుడు శాపాన్ని సమర్ధించాడు. అస్త్ర ప్రభావం ఉత్తర గర్భంపై పడగా శ్రీకృష్ణుడు ఉత్తర గర్భాన్ని రక్షించాడు. భీముడు అశ్వత్థామని సంహరించ సిద్ధమవగా ద్రౌపది గురుపుత్రుని చంపవద్దనడంతో అశ్వత్థామ తలపై శిరోమణిని తీసుకుని అతనిని వదిలేశాడు.

అశ్వత్థామకు గతమంతా గుర్తుకు రాగా నే కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ద్రౌపది క్షమాభిక్షతో తను బ్రతికి బట్టకట్లాననే విషయం గుర్తుకురాగానే తన మీద తనకే అహహ్యం కలిగింది. తను చేసిన భయంకరమైన తప్పు తన గుండెలను పిండి చేసింది. ఆ తప్పు ఏమిటంటే ద్రౌపది ధర్మరాజుల ప్రియపుత్రుడు ప్రతి వింద్యుడు పరాక్రమంలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. వింధ్యపర్వతంలా దృఢంగా ఉండే ప్రతి వింద్యుడంటే వింద్యకు అమితమైన అభిమానం. వింద్య ప్రతివింద్యుని ఊహా సుందరి. ద్రౌపది ద్వారా ఒక కుమారుని పొందాలని భీముడు అనేక యాగాలు చేశాడు. తత్ఫలితంగా వారికొక కుమారుడు కలిగాడు. అతడే శ్రుతసోముడు.

అతని ఊహాసుందరి శ్రుత. చిత్రమేమిటంటే భీమునిలోని పరాక్రమం శ్రుతివింద్యునికి అలవడితే ధర్మరాజులోని ధర్మగుణం శ్రుతసోమునికి అలవడింది. అర్జునుడు మహాకార్యాలు చేసి వచ్చిన పిమ్మట అతనికి ద్రౌపది వలన శ్రుతకీర్తి పుట్టాడు. అతని ఊహా సుందరి కీర్తి. కౌరవకులంలో పేరు పొందిన రాజర్షి శతానీకుని పేరును ద్రౌపది ద్వారా తనకు ప్రాప్తించిన కుమారునికి నకులుడు పెట్టుకున్నాడు. ద్రౌపదికి సహదేవునికి కృత్తికా నక్షత్రంలో ఒక కుమారుడు పుట్టాడు.

అతని పేరు శ్రుతసేనుడు. శతానీకుని ఊహాసుందరి శతానంద కాగా శ్రుతసేనుని ఊహాసుందరి కృత్తిక. వీరే ఉప పాండవులు. ధైర్యసాహస ధర్మాదులందు తండ్రులకే మాత్రం తగ్గనివారు. కురుక్షేత్ర యుద్ధం ముగింపుకు వచ్చింది. దుర్యోధనుడు తొడలు విరిగి పడి ఉన్నాడు.

అప్పుడు తనని సంతోషపెట్టాలని అశ్వత్థామ రాత్రివేళ పాండవ శిబిరంపై పడి నిద్రిస్తున్న ఉప పాండవులను చంపాడు. అక్కడి నుండి ఉప పాండవుల ధైర్యాదులను తలుచుకుంటూ వారే మేల్కొని ఉంటే తన గతేమని అనుకుంటూ అడవులకు పారిపోయాడు. ఈ విషయం తెలిసిన భీమార్జున కృష్ణులు అతన్ని వెతుక్కుంటూ వెళ్లారు.

ఆపై అశ్వత్థామ సమరాన తలవంచాడు. తన తప్పును తలచుకుంటూ అశ్వత్థామ వేటగాళ్ల దగ్గరకు వెళ్లాడు. తిండి పెట్టమని అర్ధించాడు. వాళ్లు మేకలను, పందులను కోస్తుండగా ఆ రక్తం తనిపై పడింది. శ్రీకృష్ణశాపం మహాశక్తివంతమైనదని అశ్వత్థామ అనుకున్నాడు. శ్రీకృష్ణుని స్తుతించాడు.

– ఉలాపుబాలకేశవ్ఞలు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/