వరద ముంపు ప్రాంతాల్లో కృష్ణా కలెక్టర్ పర్యటన
బాధతులకు పునరావాస కేంద్రంలో సహాయక చర్యలు

Vijayawada: కృష్ణానదికి వరద ఉధృతి పెరిగిన నేపథ్యంలో బేరంపార్కు, ఇబ్రహీంపట్నం ఫెర్రి, పవిత్ర సంగమం, కృష్ణలంక తదితర ప్రాంతాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ సుడిగాలి పర్యటన చేశారు.
ఈసందర్భంగా ఇబ్రహీంపట్నం, బేరంపార్కు వద్ద వరద ఉధృతిని పరిశీలించి ఇరిగేషన్ ఎస్‌ఇ నరసింహమూర్తి, ఇఇ స్వరూప్‌కుమార్‌లతో సమీక్షించారు.
కృష్ణలంకలో ఉన్న కొన్ని కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు ఇంకా వెళ్లకపోవటంపై తహశీల్దార్‌ను ప్రశ్నిస్తూ వారిని వెంటనే సమీపంలోని పునరావాస కేంద్రానికి తరలించాలని తహశీల్దార్ జయశ్రీని ఆదేశించారు.
ఈసందర్భంగా వరద ముంపు బాధితులను కలెక్టర్ ఇంతియాజ్, జెసి డాక్టర్ మాధవీలత పరామర్శించి వారిని వెంటనే పునరావాసక కేంద్రానికి వెళ్లాలని సూచించారు.
ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు ప్రకాశం బ్యారేజ్‌కి చేరటంతో పాటు దీనికి తోడుగా మున్నేరు, కట్లేరు, వైరా, మధిర , గుంటూరు జిల్లా నుంచి అధనంగా వరదనీరు తోడు అవటంతో బుధవారం సాయంత్రానికి 7.61 లక్షల క్యూసెక్కుల అవుట్‌ఫ్లో చేరిందన్నారు.
లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి వసతి, భోజన సదుపాయాలు కల్పించామన్నారు.. దురదృష్టవశాత్తూ మంగళవారం విద్యాధరపురంలో ఇల్లు గోడ కూలి ఒక వ్యక్తి మరణించాడని ఇబ్రహీంపట్నం వద్ద మరో వ్యక్తి వరదనీటిలో గల్లంతయ్యాడన్నారు. అతని ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందన్నారు.
బుధవారం అర్ధరాత్రి నుంచి గానీ గురువారం తెల్లవారుజామున గానీ 6 లక్షల క్యూసెక్కులకు వరద ఉధృతి తగ్గుముఖం పట్టవచ్చని అన్నారు..
గురువారం రెండోనెంబర్ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో భారీ వర్షాలకు 12వేల హెక్టార్లలో పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనా వేయటం జరిగిందన్నారు..
వరద తగ్గుముఖం పట్టగానే వివరాలను సేకరించటం జరుగుతుందన్నారు. ఆర్‌అండ్‌బికి సంబంధించి 7 రహదారులు కోతకు గురయ్యాయని తెలిపారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/