రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీ చేస్తానో ఇప్పుడే చెప్పలేను – మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు

వైస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా..అది ఎక్కడి నుండో..ఏ పార్టీ నుండో ఇప్పుడే చెప్పలేను అన్నారు. ఒకవేళ ఎవరూ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగానైనా బరిలో ఉంటానని తేల్చి చెప్పడం కొసమెరుపు. నియోజకవర్గ వ్యాప్తంగా తనకు మంచి పట్టు ఉందని చెప్పిన సుబ్బారాయుడు.. నరసాపురం నుంచి పోటీ చేయడం ఖాయమని… ఏ పార్టీ తరఫున పోటీ చేస్తానన్న విషయాన్ని మాత్రం ఇప్పుడే చెప్పబోనంటూ వ్యాఖ్యానించారు. అన్ని కులాల్లో తనకు పడే ఓట్లు ఉన్నాయని ధీమాగా చెప్పారు. అంతేకాదు తాను ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న సమయంలోనూ నర్సాపురం నుంచి సొంతంగా గెలిచానని విజయం సాధించానని చెప్పుకొచ్చారు.
నర్సాపురం స్థానం నుంచి 1983 నుంచి 2014 వరకు పోటీ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఒక్క 2019 ఎన్నికల్లో మాత్రమే తాను పోటీ చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే జిల్లా కేంద్రం కోసం జరిగిన ఉద్యమంలో తనపై ఏ1గా కేసు నమోదు చేయడంపై సుబ్బారాయుడు స్పందించారు. 41 నోటీసు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందని.. ఇటీవల గన్‌మెన్లను తొలగించడంపై స్పందించేందుకు నిరాకరించారు.
ఇదిలా ఉంటే… అటు అసెంబ్లీ అయినా, ఇటు లోక్ సభ సభ్యుడిగా అయినా ఆయన టీడీపీ అభ్యర్థిగానే విజయం సాధించారు. ఒకే ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసింది కూడా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే. ఉమ్మడి ఏపీ కేబినెట్‌లో గృహ నిర్మాణ శాఖతో పాటు కీలకమైన విద్యుత్ శాఖ మంత్రిగా సుబ్బారాయుడు పనిచేశారు. 2009 పార్టీలో చేరిన సుబ్బారాయుడు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయ్యాక.. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన సుబ్బారాయుడు 2014లో వైసీపీలో చేరారు. ఆ తర్వాత తిరిగి టీడీపీలోకి వచ్చిన ఆయన కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నా… ఇటీవలే పార్టీ అధిష్ఠానంపై ఆరోపణలు గుప్పించారు.