వర్మ ‘కొండా’ ట్రైలర్ రిలీజ్

వివాదాలకు , వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ..తాజాగా కొండా మూవీ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళీ ధర్ రావు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ను తెరకెక్కించారు. వరంగల్, వంచనగిరి పరసర ప్రాంతాల్లోనే ఈ చిత్ర మేజర్ పార్ట్ షూటింగ్ జరిగింది. 1990 ప్రాంతంల్లో నాటి పరిస్థితులను సినిమాలో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు వర్మ. కొండా మురళి-సురేఖ మధ్య ఉన్న లవ్ స్టోరి, ఆనాటి రాజకీయ, సామాజిక పరిస్థితులను వెండితెరపైన ఆవిష్కరించనున్నారు. నక్సలైట్లతో కొండా మురళికి ఉన్న సంబంధం, రాజకీయ ఎత్తుగడలను సైతం సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి నింపారు.

‘క్రైమ్ కొన్నిసార్లు మంచితనం నుంచి పుడుతుంది’ అని కొండా మురళి చెప్పినట్లు పేర్కొనడంతో ఈ ట్రైలర్ ప్రారంభమతుంది. ఇది వర్మ గత చిత్రాల మాదిరిగానే వైలెన్స్ తో నిండిపోయింది. ‘పెత్తందార్లు పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థ మీద పోరాడుతున్న రోజులవి. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కారల్ మార్క్స్ 180 సంవత్సరాల క్రితం చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల్లో పుట్టినవాడే కొండా మురళి..’ అని ఆర్జీవీ వాయిస్ ఓవర్ తో మురళి జీవితంలోని ఆసక్తికర సన్నివేశాలతో ట్రైలర్ ను కట్ చేశారు. ‘కొండా” చిత్రాన్ని యాపిల్ ట్రీ/ఆర్జీవీ నిర్మాణంలో శ్రేష్ఠా పటేల్ మూవీస్ సమర్పణలో కొండా సుష్మిత పటేల్ నిర్మించారు. జూన్ 23న ఈ బయోపిక్ ని థియేటర్లలోకి తీసుకురానున్నారు.