బిజెపి లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన కొండా విశ్వేశ్వర రెడ్డి

గత కొద్దీ రోజులుగా కొండా విశ్వేశ్వర రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వాటికీ సమాధానం చెప్పాడు కొండా. గురువారం సాయంత్రం మీడియా సమావేశం ఏర్పాటు చేసి..తాను బిజెపి లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గత రెండేళ్లుగా తెలంగాణ కోసం ఏది మంచిదైతే బాగుటుందని వివిధ రాజకీయ వ్యక్తులతో చర్చించానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ పాలన పోతేనే తెలంగాణ బాగుపడుతుందని నిర్ణయానికి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేసే శక్తి బీజేపీకే ఉందన్నారు. అయితే టీఆర్ఎస్ను ఓడించే సత్తా కాంగ్రెస్కు లేదన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందన్న ఆయన..ఇప్పటికే మహారాష్ట్రలో అధికారం కోల్పోయిందని..త్వరలో ఇతర రాష్ట్రాల్లోని ప్రజల విశ్వాసాన్ని కూడా కోల్పోతుందని జోస్యం చెప్పారు.

తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందనుకున్నాం కానీ అధ్వాన్నంగా తయారైంది అన్నారు. ఒకప్పుడు తెలంగాణను వ్యతిరేకించిన పువ్వాడ, తలసాని ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ లో కొనసాగుతున్నారన్నారు. 75 శాతం ప్రజలు కేసీఆర్‌పై వ్యతిరేకంగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా హుజూరాబాద్ ఫలితాలే వస్తాయి అని కొండా చెప్పుకొచ్చారు . రాష్ట్రంలో భాజపా అధికారంలో వస్తుందన్న విశ్వాసముంది. నేను రేవంత్‌రెడ్డికి వ్యతిరేకం కాదు. కాకపోతే కాంగ్రెస్ పూర్తిగా చచ్చిపోయిన తర్వాత రేవంత్‌కు పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్‌కు సకాలంలో పీసీసీ ఇచ్చి ఉంటే కాంగ్రెస్‌లోనే ఉండేవాడిని అని కొండా క్లారిటీ ఇచ్చారు.

తాను పొలిటికల్ కెరియర్ కోసం రాజకీయాల్లోకి రాలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ది… రంగారెడ్డి జిల్లా అభివృద్ది..అన్ని రంగాల్లో డెవలప్మెంట్ కావాలని రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. అభివృద్దిపై రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలను అడిగితే తెలుస్తుందన్నారు. అటు టీఆర్ఎస్ పాలనలో రంగారెడ్డి జిల్లా అన్యాయానికి గురైందన్నారు. ఈ జిల్లా నిధులను ఇతర వాటికి మళ్లించారని ఆరోపించారు.

ఉద్యమం చేసిన టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉద్యమకారులేవరు లేరని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. ఉద్యమకారుల వల్ల కుర్చీ ఎక్కి..ఇవాళ వారిని మరిచారని మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారున్నారని చెప్పారు. తెలంగాణను కోరుకున్న వారు టీఆర్ఎస్లో లేరన్నారు. బీజేపీ క్రమశిక్షణతో కూడిన పార్టీ అని , అందుకే బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. ప్రస్తుతం తాను ఒక్కడినే బీజేపీ కండువా కప్పుకోబోతున్నాన్నారు. వివిధ జిల్లాల్లోని పలువురు నేతలు కూడా తనతో చేరుతామని చెబుతున్నారన్నారు.