హుజూరాబాద్ ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన కొండా సురేఖ

రేపు హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వేళ కాంగ్రెస్ పార్టీ కి పెద్ద షాక్ ఇచ్చింది మాజీ మంత్రి కొండా సురేఖ. తెలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం షెడ్యూల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని హుజురాబాద్‌, ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్‌ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది. నవంబర్‌ 2న కౌంటింగ్‌ చేపట్టనున్నట్లు పేర్కొంది.

రేపు నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరా అనేది ఇంకా ఖరారు కాలేదు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ బరిలో మాజీ మంత్రి కొండా సురేఖ ఉండబోతుందని అంత అనుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో కొండా సురేఖ షాక్ ఇచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేదని ఆమె తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నికలో పోటీకి విముఖత చూపారని.. ఆ విషయం పార్టీ అధిష్టానానికి తెలియజేసినట్లు సమాచారం. పోటీలో లేనని కొండా సురేఖ తేల్చేయడంతో మరోమారు అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరలేచింది.