తెలంగాణ ఉక్కు మనిషి :కొండా లక్ష్మణ్‌ బాపూజి

నేడు కొండాలక్ష్మణ్‌ బాపూజి జయంతి

తెలంగాణ ఉక్కు మనిషి :కొండా లక్ష్మణ్‌ బాపూజి
Konda lakshman bapuji (File)

కొం డా లక్ష్మణ్‌ బాపూజి వెనుకబడిన వర్గాలకు భీష్మపితామహుడు. బలహీన వర్గాలకు ఆయన ఇల్లే ఆశ్రయం. ఖచ్చితత్వం, నిర్మొహమాటం ఆయన తత్వం. నిజాం నిరంకుశ ప్రభు త్వాన్ని ఎదిరించి పోరాడి, ఏడవ నిజాంపైన ఏకంగా బాంబు దాడి చేసి హైదరాబాద్‌ సంస్థానపు పోరా ట ఉధృత స్వభావాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన ఉద్యమ కెరటం. తెలంగాణ ధీశాలి కొండాలక్ష్మణ్‌ బాపూజి. 1915 సెప్టెంబర్‌ 27వ తేదీన నేటి ఆసిఫాబాద్‌, కొమరంభీం జిల్లాలోని వాంకిడి అనే గ్రామంలో కొండాలక్ష్మణ్‌ జన్మించారు. కొండాలక్ష్మణ్‌ బాపూజి

తల్లి పేరు అమ్మక్క, తండ్రి పేరు పోశెట్టి బాపూజి. తండ్రి పోస్ట్‌మెన్‌గా ఉద్యోగంలో చేరి సబ్‌పోస్ట్‌మాస్టర్‌గా 1941లో ఉద్యోగ విరమణ చేశారు. తల్లి గృహిణి. బాపూజి తన మూడవ యేటనే 1918లో తల్లిని కోల్పోయి బాల్యంలోనే తీవ్రకష్టాలను ఎదురీదారు.15వ ఏటా భారత స్వతంత్ర సంగ్రామంలో మహాత్మా గాంధీ నెరపుతున్న పోరాటంలో భాగంగా 1931లో మహారాష్ట్ర లోని నాగపూర్‌కి దగ్గరలోని చాందా ప్రాంతంలో అప్పటికే నిజాం ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించి రహస్యంగా గాంధీజీ సమావే శానికి హాజరయ్యారు. తద్వారా భారత స్వతంత్ర పోరాటం పట్ల ఆకర్షితులయ్యారు. చిన్నప్పటి నుండే ఆటలు, వకృత్వవ్యాసంగం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు.

వ్యాయామం చేస్తూ నిత్యం ఇతరులకు సహాయపడుతూ ఆటపాటల్లో శిక్షణ పొందారు. కర్రసాము, యువకులకు యుద్ధవిద్యలలో రహస్యంగా శిక్షణ ఇవ్వడం, గ్రంథాలయాలను పునరుద్ధరించడం, యువజన గణేష్‌ ఉత్సవాలు నిర్వహించడం, దూరప్రాంతాలకు వనభోజనాలకు సైకిల్‌పై వెళ్లడం, క్యాంప్‌ఫైర్‌ నిర్వహించడం లాంటి సాహస కృత్యాలు యవ్వనంలో బాపూజి నిత్యకృత్యమయ్యాయి. బాపూజి జీవిత ప్రస్థానాన్ని గమనిస్తే భారత జాతీయోద్యమంలో ప్రప్రథమంగా 1938లో అరెస్టు అయ్యారు.

అటుపిమ్మట 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. 1947 డిసెంబర్‌ 4న నిజాంపై జరిగిన బాంబుదాడిలో ప్రధాన సూత్రధారిగా నాయకత్వం వహించారు. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ను రహస్యంగా షోలాపూర్‌ వద్ద కలిపి నిజాంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం గురించి చర్చించారు. బాపూజి న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. 1951లో హైదరాబాద్‌ హైకోర్టు బాపూజికీ అడ్వకేట్‌ హోదాను ప్రదానం చేసింది.

చాకలి ఐలమ్మ భర్త నరసింహ, ఆరుట్ల కమలాదేవీ, నల్లా నరసింహులు లాంటి వారి కేసును వాదించి వారిని నిజాం చెర నుండి విడిపించారు. బడుగు బలహీనవర్గాలకు నాయకత్వం వహిస్తున్న క్రమంలో 1943లో చేనేత కార్మిక సంఘం వ్యవస్థాపన చేశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌ రాష్ట్ర కో ఆపరేటివ్‌ సొసైటీని 1950లో ఆరంభించి వ్యవస్థాపక అధ్యక్షులుగా కొనసాగారు. 1939 నిజాం రాష్ట్ర పద్మశాలి యువజన సంఘంలో అటుపిమ్మట 1941 ఆంధ్రమహాసభలో చేరి క్రియాశీలకంగా పనిచేశారు. చిట్యాల(చాకలి) ఐలమ్మ తాను పండించిన పంటకు శిస్తు ఎందుకు చెల్లించాలని కడవెండి (ఇప్పటి జనగామ జిల్లా ప్రాంతం) జమీందార్‌ విన్నూర్‌ రామచంద్ర రెడ్డితో విభేదించి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు నాయకులతో కలిసి ఎదురుతిరగగా సూటిగా ఏమీ చేయలేక దొర తన మూకలతో కలిసి ఐలమ్మ భర్త నరసింహపై మోసపూరిత కుట్ర అనేఅభియోగాన్ని నెరపి జైలుపాలు చేయగా సైకిల్‌పై ప్రయాణిస్తూ బాపూజి భువనగిరి కోర్టులో ఉచితంగా వాదించి దొరకు దిమ్మతిరిగేలా ఐలమ్మ భర్తను విడిపించారు.

ఇదేకాక తెలంగాణ సాయుధ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి, షేక్‌ బందగి లాంటి తెలంగాణ సాయుధ పోరాటవీరులను కాపాడి కమ్యూనిస్టుల మన్ననలు పొందారు. ఇదీ బాపూజికి అణగారిన వర్గాల పట్ల ఉన్న చిత్తశుద్ధి. ఇది మనతరాలు, భావితరాలు బాపూజి నుండి నేర్చుకోవాల్సింది. నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా సాగిన రహస్య కార్యకలాపాలను మొదలుకొని ఆంధ్రమహాసభ తెలంగాణ రైతాంగ సాయుధపోరాటం, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ ఆ తర్వాత చేనేత సహకారోద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం ఇలా అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించి బాపూజి చరిత్ర పుటలకెక్కారు. కొండా లక్ష్మణ్‌బాపూజి వివాహం జూన్‌ 27, 1948లో డాక్టర్‌ శకుంతలాదేవీతో జరిగింది.

బాపూజికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. 1962 చైనా యుద్ధసమయంలో ప్రధాని నెహ్రూ దేశ ప్రజల సహకారం కోరగా డాక్టర్‌ శకుంతలాదేవీ తన బంగారు గాజులను జాతీయ రక్షణ నిధికి ఇవ్వడంతోపాటు చైనా సరిహద్దు ప్రాంతంలో భారత సైన్యానికి వైద్య సేవలందించారు. భారతదేశ స్వాతంత్య్రానంతరం బలహీనవర్గాల స్థితిగతుల కోసం వేసిన కాకా కాలేల్కర్‌ కమిషన్‌లో డాక్టర్‌ శకుంతలాదేవి సభ్యులుగా ఉన్నారు.

హైదరాబాద్‌ సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన తర్వాత తెలంగాణ ప్రాంతంలో 1952లో జరిగిన మొదటి శాసనసభ ఎన్నికలలో బాపూజి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత 1956లో భాషా ప్రాతిపదికన ఏర్పాటు అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికలలో గెలిపొంది 1957 ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

తన అద్వితీయ ప్రతిభతో, ప్రజాభీµష్టంతో బాపూజి 1960లో మూడవసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బాపూజి ఐదుసార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి డిప్యూటీ స్పీకర్‌గా, రెండుసార్లు మంత్రిగా పనిచేశారు. రాజకీయాలలో తనదైన ముద్రతో పేద ప్రజల పక్షాన నిలబడి బాపూజిని 1960 జనవరి 11న కేబినెట్‌ మంత్రి పదవి వరించింది. లఘుపరిశ్రమలు, కుటీరపరిశ్రమలు, ఎక్సైజ్‌ మద్యనిషేధ శాఖలు అప్పగించబడ్డాయి. బాపూజి జీవితం భావిభారత పౌరులకు మార్గదర్శకం. సమసమాజ నిర్మాణం, రాజ్యంగ ఫలాలు అందరికి అందాలని ఆయన ఆకాంక్ష.

  • దాసు సురేష్‌

తాజా క్రీడావార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/