హోం మంత్రి అమిత్‌ షాను కలిసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హోం మంత్రి అమిత్‌ షాను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. తెలంగాణ వరద సహాయం కోసమే హోం మంత్రిని కలిశానని, వరద కష్టాలపై షాతో చర్చించానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. వరదలతో రూ.1,400 కోట్ల నష్టం వాటిల్లిందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. తాను ఈ భేటీకి వెళ్లకపోయి ఉంటే.. రాష్ట్రానికి నష్టం జరిగేదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ కోసం పదవీత్యాగం చేసిన వ్యక్తిని తానని, పదవుల కోసం వెంటపడే వ్యక్తిని కాదని, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే బరాబర్‌ చెప్పి పోతా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేసారు. ఇక అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్‌రెడ్డి.. అమిత్‌ షాను కలిశారు. బీజేపీలో చేరిక, మునుగోడు బహిరంగ సభపై చర్చలు జరిపారు. ఆ తర్వాత ఈ నెల 21 న అమిత్ షా సమక్షంలో బిజెపి లో చేరబోతున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటె తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ లో చేరడం ఫై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడం ఏంటి అని ప్రశ్నించారు. ఈవిషయంలో రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారన్నారు. ఇక నుంచి తాను రేవంత్ రెడ్డి ముఖం చూడనని తేల్చి చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత తాను మునుగోడుకు వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.