బిజెపి తీర్థం పుచ్చుకోబోతున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి..?

కాంగ్రెస్ పార్టీ కి షాక్ తగలబోతుందా..? కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి బిజెపి కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు..? ప్రస్తుతం ఇదే చర్చ నడుస్తుంది. అతి త్వరలో కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబదించిన రంగం సిద్ధం చేసుకున్నారని , రెండు రోజుల కిందట ఓ కేంద్ర మంత్రి, అమిత్‌ షాలతో చర్చలు జరిపారని అంటున్నారు. వారిద్దరూ దాదాపు 45 నిమిషాలపాటు చర్చలు జరిపారని , ఈ సమావేశానికి జార్ఖండ్‌లోని గోడా నియోజకవర్గ ఎంపీ నిషికాంత్‌ దూబే (బీజేపీ) మధ్యవర్తిత్వం వహించారని సమాచారం. రాజీనామా చేసి పార్టీలోకి రావాలని రాజగోపాల్ రెడ్డికి అమిత్ షా సూచించారని , దీనికి రాజగోపాల్‌ ఓకే చెప్పారని అంటున్నారు. మరి నిజంగానే రాజగోపాల్‌ రెడ్డి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పబోతున్నారా..? బిజెపి కండువా కప్పుకోబోతున్నారా..? అనేది ఆయనే చెప్పాలి.

కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి..భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2009లో భువనగిరి లోకసభ నియోజకవర్గం నుండి పోటిచేసి భారత కమ్యునిస్టు పార్టీ అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1,39,978 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. తరువాత 2016 నుండి 2018 వరకు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు శాసనసభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటిచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం భువనగిరి లోకసభ ఎంపిగా ఉన్నాడు.