రేపు ప్రధాని తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేపు శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి..కాంగ్రెస్ ను వీడి , బిజెపి లో చేరగా..ఇప్పుడు సోదరుడి బాటలోనే వెంకట్ రెడ్డి వెళ్లబోతున్నారా అనే చర్చ మొదలైంది. గత కొద్దీ నెలలుగా వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ప్రధాని మోడీతో భేటీ అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

అభివృద్ధి పనులకు సంబంధించి ప్రధాని అపాయింట్మెంట్ కోరిన ఎంపీ.. మూసీ ప్రక్షాళన, నేషనల్ హైవే ఇష్యూస్ కి సంబంధించి ప్రధానమంత్రి తో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీ లోనే ఉన్నారు. కాగా,నిన్న ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారిని కలిసి తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, సీనియర్లు పార్టీని వీడుతుండడంపై చర్చించారు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి. ఈ విషయాన్ని తన ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

తాజాగా కాంగ్రెస్ పార్టీ వేసిన కమిటీల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి చోటు దక్కలేదు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని గతంలో తెలిపారు. అంతే కాకుండా పార్టీలో సీనియర్లకు గౌరవం దక్కడం లేదని ఆరోపించారు. మరి రేపు ప్రధాని తో అభివృద్ధి పనుల గురించే మాట్లాడతారా..? లేక పార్టీలో చేరే గురించి మాట్లాడతారా అనేది చూడాలి.