కోహ్లీ త్వరలో రాణిస్తాడు : కపిల్‌దేవ్‌, వివిఎస్‌ లక్ష్మణ్‌

Kapil Dev, VVS Laxman
Kapil Dev, VVS Laxman


న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో ఘోరంగా విఫలమవుతున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అద్భుతంగా రాణించే బ్యాట్స్‌మెన్‌లు ఉన్నప్పటికీ ఈ లీగ్‌లో ఖాతా తెరవని ఏకైక జట్టుగా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానంలో ఉంది. సారథి విరాట్‌ కోహ్లీ పేలవ ప్రదర్శన అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ మ్యాచుల్లో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన విరాట్‌…ఈ ఐపిఎల్‌ సీజన్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 78 పరుగులు మాత్రమే చేశాడు. అందులో అతడు చేసిన అత్యుత్తమ స్కోరు 46(ముంబయి ఇండియన్స్‌పై). అతడి ఆటతీరుపై విమర్శలు వస్తుండటంతో టీమిండియా మాజీ ఆటగాళ్లు వివిఎస్‌ లక్ష్మణ్‌, కపిల్‌దేవ్‌ స్పందిస్తూ పలు సూచనలు చేశారు. కోహ్లీ మళ్లీ రాణించగలడని, అతడు సానుకూల దృక్పథంతో ఉండాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.గత ఐపిఎల్‌ టోర్నీల్లో కూడా స్పిన్నర్ల చేతిలో విరాట్‌ కోహ్లీ ఔటయ్యాడు. ముఖ్యంగా గూగ్లీస్‌ చేతిలో వెనుదిరిగాడు. గతేడాది జరిగిన ఐపిఎల్‌లోనూ ముజ్బీబ్‌, జంపా, మర్కాండేల బౌలింగ్‌లో ఔటయ్యాడు. మొన్న జరిగిన మ్యాచ్‌లో అతడిని శ్రేయాస్‌ ఔట్‌ చేశాడు. ఈ విషయాన్ని విరాట్‌ కోహ్లీ గుర్తుంచుకుంటాడని నేను భావిస్తున్నాను. ఏ విధంగా అతడు ఔటయ్యాడో…ఆ విషయంపై దృష్టిపెట్టి దాని నుంచి బయిటపడతాడు. ఇందుకు చక్కని ఉదాహరణగా అతడు ఆడిన ఇంగ్లాండ్‌ సిరీస్‌ల గురించి చెప్పుకోవచ్చు. 2013లో ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో పేలవ ప్రదర్శన కనబర్చిన కోహ్లీ…ఇటీవల అదే జట్టుతో జరిగిన సిరీస్‌లో మాత్రం దాదాపు 600 పరుగులు సాధించాడు. దీన్ని బట్టే అతడు ఎటువంటి ఆటగాడో చెప్పుకోవచ్చు. అతడు ప్రత్యేకమైన ఆటగాడు. ఇప్పుడు కూడా అతడు పుంజుకుంటాడని వివిఎస్‌ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. ఆర్‌సిబి ఆడే తదుపరి మూడు మ్యాచ్‌లు ఆ జట్టుకి చాలా కీలకమని, కోహ్లీతో పాటు జట్టులోని ఎబి డివిలియర్స్‌ చాలా నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లని లక్ష్మణ్‌ చెప్పారు. కాగా, విరాట్‌ కోహ్లీ ఆటతీరుపై కపిల్‌ దేవ్‌ స్పందిస్తూ సానుకూల దృక్పథంతో అతడు తదుపరి మ్యాచ్‌లు ఆడతాడని చెప్పారు. ప్రతికూల దశ కొనసాగిందని, అయితే, అది ఇప్పుడు ముగిసిందని సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తి చెబుతాడు. కోహ్లీకి ఇప్పుడు కాస్త అదృష్టం కావాలి….అలాగే, తనకు ఉన్న అనుభవాన్ని వినియోగించుకోవాలి. అతడు వీటన్నింటి కూర్పుతో రాణిస్తాడని నేను భావిస్తున్నాను. తన ఆటతీరు ఏంటో అతడికి తెలుసని వ్యాఖ్యానించాడు.

మరిన్నీ తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/