సచిన్ కంటే కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడు

లండన్: క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కంటే ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీనే అత్యుత్తమ ఆటగాడని ఇంగ్లాండ్ మాజీ సారథి మైకేల్ వాన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే కేవలం వన్డే క్రికెట్లో మాత్రమే కోహ్లీ అత్యుత్తమ ఆటగాడంటూ పేర్కొన్నాడు. టీమిండియా పరుగుల యంత్రం తన మైమరిపించే ఆటతో అనేక కొత్త రికార్డులను కొల్లగొడుతున్నాడని వాన్ ప్రశంసల జల్లు కురిపించాడు. దీంతో వన్డేల్లో అత్యుత్తమ ఆటగాళ్ల జాబితాలో ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న సచిన్, బ్రియన్ లారాలను కోహ్లీ వెనక్కినెట్టాడని వివరించాడు. ప్రస్తుతం మైకేల్‌వాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొద్దినెలలుగా కోహ్లీ, సచిన్‌లలో ఎవరు గొప్ప అనే అంశం అటు అభిమానుల్లో ఇటు క్రికెట్ పండితుల మధ్య పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ తన 41వసెంచరీ నమోదు చేశాడు. ప్రస్తుం కోహ్లీ ఫామ్‌ను చూస్తే వన్డేల్లో సచిన్ (49) అత్యధిక సెంచరీల రికార్డును త్వరలోనే అధిగమించే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఐసిసి టెస్టు, వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.