సఫారీలపై అత్యధిక విజయాల శాతం నమోదు చేసిన కోహ్లీ…

Kohil
Kohil

రాంచీ: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో రికార్డు సాధించాడు. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో గెలిచి సిరీస్‌ను 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేయడం ద్వారా భారత కెప్టెన్‌గా విరాట్‌ తన విజయాల శాతాన్ని మరింత పెంచుకున్నాడు. ప్రధానంగా దక్షిణాఫ్రికాపై కోహ్లీ నేతృత్వంలోని భారత్‌ 10 టెస్టులు ఆడగా అందులో ఏడు విజయాల్ని నమోదు చేసింది. దాంతో సఫారీలపై కోహ్లీ విజయాల శాతం 70గా నమోదైంది. కాగా, ఇక్కడ మిగతా భారత కెప్టెన్లకు అందనంత ఎత్తులో నిలిచాడు కోహ్లీ. మిగతా అంతా కలిసి సఫారీలపై 29 టెస్టులు ఆడగా విజయాల శాతం 24.14గా ఉంది. ఓవరాల్‌గా దక్షిణాఫ్రికాపై భారత్‌ ఇప్పటివరకూ ఆడిన టెస్టులు 39. ఇక చాలాకాలం పాటు నిషేధం ఎదుర్కొని దక్షిణాఫ్రికా తిరిగి క్రికెట్‌ను ఆరంభించిన తర్వాత మూడు అంతకంటే పైగా టెస్టుల సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ కావడం మూడోసారి మాత్రమే. గతంలో 2001-02 సీజన్‌లో ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో 0-3 తేడాతో సఫారీలు సిరీస్‌ కోల్పోగా, అటు తర్వాత ఆసీస్‌పై దక్షిణాఫ్రికాలో 0-3తో సిరీస్‌ను చేజార్చుకున్నారు. 14ఏళ్ల తర్వాత సఫారీలు మరోసారి క్లీన్‌స్వీప్‌ అయ్యారు. భారత్‌ పర్యటనకు ఎంతో ఉత్సాహంతో వచ్చిన సఫారీలు టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌ అయ్యి తిరిగి వెళుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి. https://www.vaartha.com/news/national/