పాలన చేతగాకపోతే దిగిపోవాలంటూ కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రొఫెసర్ కోదండరాం

పాలన చేతగాకపోతే దిగిపోవాలంటూ కేసీఆర్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు ప్రొఫెసర్ కోదండరాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ వికటించిన నలుగురు మహిళలు మృతి చెందిన సంగతి తెలిసిందే. మరికొంతమంది నిమ్స్ హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన ఫై ఇప్పటికే పలు రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ…బాధిత కుటుంబాలను ఆదుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో మృతి చెందిన కుటుంబాలను ఈరోజు శనివారం కోదండరాం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు చనిపోవడం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ అసమర్థ పాలనకు ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం 3 శాతం నిధులు మాత్రమే ఖర్చు చేసోందన్న ఆయన… అలా అయితే మౌళిక సదుపాయాలు ఎలా మెరుగుపడుతాయని ప్రశ్నించారు. హడావుడిగా 34 మందికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. ఆపరేషన్ తర్వాత పేషెంట్లకు సరియైన మందులు ఇవ్వలేదని ఆరోపించారు.

ఈ ఘటన పట్ల ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలన్న కోదండరాం… హరీశ్ రావును వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. బాధిత కుటుంబాలకు రూ. కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.