ధరణి వచ్చింది.. దరిద్రం వచ్చింది – కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి

ధరణి వచ్చింది.. రైతులకు దరిద్రం వచ్చిందన్నారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి. తాజాగా ధరణి రచ్చబండ కార్య క్రమంలో పాల్గొన్న కోదండ రెడ్డి..ధరణి ఫై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో భూ సమస్యలు బాగా పెరిగిపోయాయని , భూసమస్యలను సిఎస్ సోమేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుద్దాం అంటే అయన టైం ఇవ్వడంలేదన్నారు. సీఎంకు ఎన్ని లేఖలు రాసినా స్పందన కరువైందని కోందడ రెడ్డి చెప్పుకొచ్చారు. అబ్దుల్లాపూర్మెట్ లో ఎమ్మార్వో చనిపోవడానికి భూ సమస్యలే కారణమని తెలిపారు

. కాంగ్రెస్ హయాంలో ఇలాంటి భూసమస్యలు రాలేదన్నారు. అసైన్డ్ ల్యాండ్స్ వెంచర్లు గా వేసుకుని అధికార పార్టీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని ఆరోపించారు. మరోపక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క భూముల విలువ పెంపు పేరుతో దందా చేస్తున్న సీఎం కేసీఆర్.. దున్నే వాడికి భూమి లేకుండా చేస్తున్నాడని ఆరోపించారు. సిటీ పేరుతో అడ్డగోలుగా భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ ఖాళీ భూములు కనిపించినా వాటిని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఫారెస్ట్ అధికారులు సైతం భూములు లాక్కుంటూ.. పోడు రైతులపై దాడులు చేస్తున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.