అమ్మఒడి ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి

చైనాలో కరోనా వైరస్‌ ఉంటే ఏపీలో ఎల్లో వైరస్‌ మరింత ప్రమాదకరం

kodali nani
kodali nani

తాడేపల్లి: అమ్మ ఒడి పథకం ద్వారా 44 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే సంక్షేమ పథకాలతో కోటిమందికిపైగా ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ కన్నా ఎల్లో వైరస్‌ మరింత ప్రమాదకరమైనదని ఆయన విమర్శించారు. చైనాలో కరోనా వైరస్‌ ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో వైరస్‌ విజృంభించిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ పథకాలపై ఎల్లో మీడియా చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తూర్పారబట్టారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సిపి కేంద్ర కార్యాలయంలో ఆదివారం కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 39 లక్షల మందికి ఇచ్చే పెన్షన్లను.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 54 లక్షల మందికి పెంచారని మంత్రి కొడాలి నాని తెలిపారు. తమ ప్రభుత్వం రూ.1000 పెన్షన్‌ను రూ.2,250కి పెంచిందని గుర్తుచేశారు. పెన్షన్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్లతో ఇంటి వద్దనే అందచేస్తున్నామని పేర్కొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/