నారాయణ అరెస్ట్ ఫై కొడాలి నాని స్పందన

టెన్త్ పేపర్ లీకేజ్ విషయంలో మాజీ మంత్రి , తెలుగుదేశం నేత నారాయణ ను పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నారాయణ అరెస్ట్ ఫై తెలుగుదేశం నేతలు విమర్శలు కురిపిస్తుండగా..వైసీపీ నేత కొడాలి నాని నారాయణపై కక్ష సాధించాల్సిన అవసరం మాకేముంది అని తెలిపారు. నారాయణ గత మూడేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారని, ఒకవేళ ఆయన జగన్ కు వ్యతిరేకంగా దూకుడైన రాజకీయాలు ఏమైనా చేస్తున్నాడని మేం టార్గెట్ చేస్తామా? నారాయణ ఏమైనా మాకు వ్యతిరేకంగా యుద్ధాలు నడుపుతున్నాడా… లేదు కదా…! అంటూ కొడాలి నాని వ్యాఖ్యానించారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే ఎవరినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. లక్షల మంది పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. జగన్ సర్కారుపై బురద చల్లేందుకు పిల్లల భవిష్యత్తును పణంగా పెడుతున్నారని కొడాలి నాని విమర్శించారు. పరీక్ష మొదలైన కాసేపటికి ప్రశ్నాపత్రాలను ఫొటోలు తీసి బయటికి పంపి పేపర్ లీకైందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగ్గు లేకుండా టీడీపీ నేతలు సమర్థించుకుంటున్నారని అన్నారు. జగన్ ను దించడానికి అత్యాచారాలు, హత్యలు, పేపర్ లీకేజీలకు పాల్పడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు.