కెసిఆర్‌కు షాక్‌ 1969 తెలంగాణ ఉద్యమం కారుల సంఘం

venkat reddy TJS party
venkat reddy TJS party

సైఫాబాద్‌,ప్రభాతవార్త: టిఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కెసిఆర్‌కు 1969 ఉద్యమకారులు షాక్‌ ఇచ్చారు. ప్రజా కూటమికి 1969 తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మద్దతు ప్రకటించింది. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చక్రహరి రామరాజు, మారం సంతోష్‌రెడ్డి మాట్లాడుతూ తమ ఉద్యమకారులను గుర్తించి ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం జరిగిందని, కాని ఏ రాజకీయ పార్టీ తమ సమస్యలను ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చలేదని, ఒక్క ప్రజా కూటమి మాత్రమే మ్యానిఫెస్టో చేర్చడం జరిగిందని, అందుకే సంపూర్ణంగా ప్రజా కూటమికి మద్దతు ప్రకటించామని చెప్పారు. 1969 ఉద్యమకారులు, కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి ప్రజా కూటమి విజయం కోసం విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. కెసిఆర్‌ తమను నిర్లక్ష్యం చేశారని, తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని, ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా తమను పట్టించుకోలేదని, నాలుగు సంవత్సరాల కాలంలో ఆనేక వినతి పత్రాలు పంపడం జరిగిందన్నారు. ప్రజా కూటమి 1969 ఉద్యమ కారులను గుర్తిస్తామని, పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తామని, బస్‌పాస్‌ అందిస్తామని, అర్హులైన వారికి ఇళ్ళు కేటాయిస్తామని, ఉచితంగా మేరుగైన వైద్య సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చి ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చడం జరిగిందని వారు వివరించారు. తెలంగాణ జన సమితి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మాట్లాడుతూ 1969 ఉద్యమకారులను గుర్తిస్తే తన ఉనికికే ప్రమాదం వస్తుందని కెసిఆర్‌ ఉద్యమకారులను గుర్తించలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 48 వేల కోట్లు దుర్వినియోగం జరిగిందని, నాడు స్వార్ధం లేకుండా తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించకుండా కెసిఆర్‌ అహాంకారంతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని ఆరోపించారు. కెటిఆర్‌ 2006 నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, తొలిదశ, మలిదశ ఉద్యమంలో పాల్గోని త్యాగాలు చేసినవారి సంగతి ఎమిటని? ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సిద్ధాంత కర్త ప్రోఫెసర్‌ జయశంకర్‌ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై కెసిఆర్‌ ఏర్పాటు చేయలేకపోయారని ఆయన విమర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎన్‌.బాలమల్లేష్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కెసిఆర్‌కు చరమగీతం పాడి ప్రజాకూటమి విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యకారులకు ప్రజా కూటమి న్యాయం చేస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో ఉద్యమకారులు కొల్లూరి చిరంజీవి, తెలంగాణ పిసిసి లింగ్విస్టిక్‌ మైనారిటి సేల్‌ ఛైర్మన్‌ ఠాకూర్‌ హృదయనాధ్‌సింగ్‌, టిడిపి నాయకుడు బిఎన్‌ రెడ్డి, నాయకులు శంకరనారాయణ, నీరా కిషోర, ఎంఎంఎం ఖాన్‌, తెడ్ల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.