వరదలతో ప్రజలు అల్లాడుతుంటే..ఢిల్లీలో కేసీఆర్ ఏంచేస్తున్నారని ప్రశ్నించిన కిషన్ రెడ్డి ..

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అల్లాడిపోతుంటే..సీఎం కేసీఆర్ ఢిల్లీ లో నాల్గు రోజులుగా ఏంచేస్తున్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మూసీకి వరద రావడంతో నీట మునిగిన ముసారాంబాగ్ బ్రిడ్జిని ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి ఈసారి కూడా భారీ వర్షాల కారణంగా లక్ష ఇళ్లు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది కూడా ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏడాది తర్వాత కూడా మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి మార్పులు రాలేదని మండిపడ్డారు. మూసీ డెవలప్ మెంట్ కోసం ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేసినా.. ఒక్క అడుగు కూడా ముందు పడలేదని చెప్పారు. ప్రాజెక్టు రిపోర్టు రెడీ అయిందని లోన్లు వస్తున్నాయని చెప్పడం మినహా కేసీఆర్ సర్కారు చేసిందేమీలేదని అన్నారు.

వరదలతో ప్రజలు కష్టాల్లో ఉంటే.. ప్రగతిభవన్​ దాటి బయటికి రాని కేసీఆర్​.. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. ప్రభుత్వ అండదండలతో కొందరు ఇష్టారాజ్యంగా మూసీని ఆక్రమిస్తున్నందునే ఏటా పేదల ఇళ్లు నీట మునుగుతున్నాయని కిషన్​రెడ్డి ఆరోపించారు. విపత్తు వేళ ఉపయోగించుకునేందుకు ఎస్డీఆర్​ఎఫ్​ నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ.. రాష్ట్ర సర్కార్​ విఫలమైందని కిషన్​రెడ్డి విమర్శించారు. సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మూసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని చెప్పినా కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. గుజరాత్ లోని సబర్మతి నదిని పరిశీలించి వచ్చిన మంత్రులు మూసీపై రోడ్లు వేసి సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం మాత్రం రాజకీయ ఆలోచనలపైనే దృష్టి పెట్టారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీలో కేసీఆర్ నాలుగు రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా ఏం చేశారని నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వరదల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.