భైంసాలో హింస పై స్పందించిన కిషన్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్

హైదరాబాద్: మూడ్రోజుల కిందట భైంసాలో జరిగిన మతపరమైన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మాట్లడుతూ.. హింసాత్మక ఘటనలను ఖండిస్తున్నానని అన్నారు. గత మూడ్నాలుగు దశాబ్దాలుగా భైంసాలో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉందని, ఓ వర్గం వారు మరో వర్గంపై తరచుగా దాడులు చేస్తున్నారని, ఇది ఏమాత్రం మంచిది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఓసారి దాడి జరగ్గా, కొద్ది వ్యవధిలోనే మళ్లీ దాడి జరగడం చూస్తుంటే… మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు, సామాన్య ప్రజలను హింసించేందుకు కొన్ని విద్రోహశక్తులు కుట్ర పన్నినట్టు అర్థమవుతోందని అన్నారు.

ఈ దాడులపై ఇప్పటికే తెలంగాణ డీజీపీతో రెండుసార్లు మాట్లాడానని, వీటిపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేయాలని కోరానని వివరించారు. మతకల్లోలాలు, ఘర్షణలు జరగకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్టు కిషన్ రెడ్డి వెల్లడించారు.

తాజా వీడియోస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/