బండి సంజయ్ ను పరామర్శించిన బీజేపీ నేతలు

ములాఖత్ సమయంలో సంజయ్ ను కలిసిన కిషన్ రెడ్డి, ఈటల


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్ పరామర్శించారు. జైల్లో ములాఖత్ సమయంలో సంజయ్ ను కలిసేందుకు వీరు ముగ్గురుకి అనుమతినిచ్చారు. దీంతో ములాఖత్ సమయంలో సంజయ్ ను వీరు కలిశారు. అనంతరం కరీంనగర్ లోని సంజయ్ కార్యాలయాన్ని వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ కార్యాలయంపై ఏ ప్రాతిపదికన పోలీసులు దాడి చేశారని ప్రశ్నించారు. ధర్నాచౌక్ వద్ద సీఎం కేసీఆర్, ఆయన కుటుంబం, వారి ఎంపీలు, ఎమ్మెల్యేలు ధర్నా చేయవచ్చు కానీ… ఇతర పార్టీల నేతలు చేయకూడదా అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతటి అణచివేత లేదని అన్నారు. ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె, రోడ్డు రోకోలు, రైల్ రోకోలు ఇలా ఎన్నో చేశామని… ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే అణచివేత జరుగుతోందని విమర్శించారు. ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఆందోళన చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అడ్డుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు బీజేపీ భయపడదని చెప్పారు. టీఆర్ఎస్ కు లేని కరోనా నిబంధనలు బీజేపీకి మాత్రమే వర్తిస్తాయా? అని ప్రశ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/