కన్నీరు పెట్టుకున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌

ప్రజల కష్టాలను ప్రస్తావించిన సమయంలో కన్నీరు

Kim Jong Un

ప్యోంగ్యాంగ్‌: ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్‌ ఉన్‌ ఇటీవల జరిగిన అధికార వర్కర్స్‌ పార్టీ 75వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడుతూ.. భావోద్వేగభరితంగా మాట్లాడి కన్నీరు పెట్టుకున్నారు. ఉత్తరకొరియా ప్రజల కష్టాలను ప్రస్తావించిన సమయంలో, సైనికుల సేవలను గుర్తు చేసుకున్నప్పుడు ఆయన కంటతడి పెట్టుకున్నారు. తమ దేశ రక్షణ వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉత్తరకొరియా రక్షణ శక్తిని, స్వీయ రక్షణను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. తమ దేశంపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలు, అలాగే, తుపానులు, కరోనా వ్యాప్తి ‌ కారణంగా ఆర్థిక వ్యవస్థపై గతంలో ఇచ్చిన హామీలను తాను నెరవేర్చలేకపోయానని ఆయన తెలిపారు.

తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా చేయలేకపోయినందుకు సిగ్గుపడుతున్నానని వ్యాఖ్యానించారు. తమ దేశ ప్రజల్ని కష్టాల నుంచి బయటికి తీసుకొచ్చేందుకు తన ప్రయత్నాలు, అంకిత భావం సరిపోలేదని చెప్పారు. అయితే, తమ దేశంలో ఒక్కరు కూడా కరోనా బారిన పడకపోవడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. కరోనా సంక్షోభం ముగిసిన అనంతరం ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మళ్లీ స్నేహ బంధాన్ని నెలకొల్పుతాయని ఆశిస్తున్నానని చెప్పారు. అయితే, ఆయన తన సహజ శైలికి భిన్నంగా ప్రవర్తించిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన నియంతృత్వ పోకడల పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని తగ్గించి, వారి సానుభూతి పొందడానికే ఆయన అలా ప్రవర్తించారని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తరకొరియా ఆర్థిక వ్యవస్థ క్షీణించడం, పరిపాలన విషయంలో తనపై నెలకొన్న ఒత్తిడి కారణంగానే ఆయన కంటతడి పెట్టుకుని వుంటారని మరి కొందరు అంటున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/