300 ప్రశ్నలు-కొన్నిటికే జవాబులు

3వ రోజు సాగిన అఖిలప్రియ విచారణ- నేడు మళ్లీ జైలుకు తరలింపు

Akhila priya
Akhila priya

Hyderabad: బోయిన్‌పల్లిలో ముగ్గురు వ్యాపారుల కిడ్నాప్‌ కేసులో అరెస్టయిన ఎపి మాజీ మంత్రి అఖిలప్రియను ఉత్తర మండల పోలీసులు వరుసగా మూడవ రోజు కూడా విచారించారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బేగంపేట మహిళా పోలీసు స్టేషన్‌లో సాగిన ఈ విచారణలో ఉత్తర మండల డిసిపి కల్మేశ్వర్‌ సింగన్వార్‌తో పాటు ఇద్దరు ఎసిపిలు, మహిళా పోలీసు అధికారులు పాల్గొ న్నారు.

ఈ సందర్బంగా అఖిలప్రియను పోలీ సులు 300 ప్రశ్నలు సంధించి అనేక ప్రశ్నలకు ఆమె నుంచి సమాధానం రాబట్టినట్లు తెలిసింది. మొదట్లో తనకేమీ తెలియదని, అనారోగ్య కారణాల వల్ల చాలా విషయాలు గుర్తులేవని, ఇంకొన్నింటిని మరచిపోయానని అఖిలప్రియ చెప్పినప్పటికీ భర్త భార్గవరాం, కిడ్నాప్‌ గ్యాంగ్‌ లీడర్‌ గుంటూరుశ్రీనులతో సెల్‌ఫోన్‌ సంభాషణలను పోలీసులు ఆమె ముందుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది.

వ్యాపారుల కిడ్నాప్‌ విషయంలో పోలీసులు పదే పదే ప్రశ్నలు వేయడంతో చివరకు ఆమె తన నేరాన్ని అంగీకరించిందని తెలిసింది. హఫీజ్‌పేట్‌లో తన తండ్రి నాగిరెడ్డి కొన్న 25 ఎకరాల భూమి విషయంలో ప్రవీణ్‌ రావు సోదరులతో వివాదం వుందని, ఈ వివాదంపై చర్చించేందుకు ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతోనే వారిని కిడ్నాప్‌ చేశానని, ఈ క్రమంలో తన భర్త భార్గవరాంతో పాటు గుంటూరు శ్రీను ఇతర నేరగాళ్లు సహాయం చేశారని అఖిలప్రియ పోలీసులకు వెల్లడించిందని తెలిసింది.

కాగా అఖిలప్రియ వెల్లడించిన సమాచారం ఆధారంగా యూసుఫ్‌ గూడలోని భార్గవరాంకుచెందిన పాఠశాలతోపాటు కూకట్‌పల్లిలో నేరగాళ్లు సమావే శమైన హోటల్‌కు పోలీసులువెళ్లి అక్కడ కొన్నిఆధారాలు సేకరించారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/