ఖమ్మం బిఆర్ఎస్ సభ హైలైట్స్

బిఆర్ఎస్ తొలి సభ ఖమ్మం లో అట్టహాసంగా జరిగింది. దాదాపు మూడు లక్షల పైగా కార్యకర్తలు ఈ సభకు హాజరయ్యారు. ప్రతి గ్రామం నుండి వందల సంఖ్యలో ప్రజలు హాజరై సభను సక్సెస్ చేసారు. బిఆర్ఎస్ నేతలే కాకుండా ఢిల్లీ , పంజాబ్ , కేరళ ముఖ్యమంత్రులు సైతం హాజరయ్యారు. ఇక ఈ సభలో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్‌ అజెండా, పాలసీలను వెల్లడించారు. పార్టీ సమగ్ర విధానం త్వరలోనే ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ కోర్‌ అజెండా మాత్రం వెల్లడించారు. సంక్షేమం, జాతీయికరణ మా విధానం అని తేల్చేశారు. సమగ్రాభివృద్ధికి కావాల్సిన నివేదికలు, పాలసీలు రూపొందిస్తున్నామన్న సీఎం కేసీఆర్‌ దళితబంధు, రైతుబంధు వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలుచేసి తీరుతామన్నారు.

రాజకీయాలు జరుగుతుంటాయి. గెలుపు ఓటములు సహజం. కానీ భారత దేశం , భారత సమాజం లక్ష్యం ఏంటి.. భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందా.. దారి తప్పిందా.. బిత్తరపోయి గత్తర పడుతుందా.. ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో.. ఈ విషయం మీద నా అంతరాత్మ అనేక రకాలుగా కలిచి వేస్తా ఉంది. అందరూ సీరియస్‌గా ఆలోచించాలి” అని పిలుపునిచ్చారు.

అలాగే ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా నేర్చుకున్నామని , కేసీఆర్‌ను పెద్దన్నగా సంబోధించారు. కంటి వెలుగు కార్యక్రమం, సమీకృత కలెక్టరేట్ల కాన్సెప్ట్‌ అద్భుతమని ప్రశంసించారు. కంటి పరీక్షలు ఉచితంగా అందించడం గొప్ప విషయం, ఈ కార్యక్రమాలను ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రాల్లోనూ అమలు చేస్తాం అని సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. గవర్నర్లను ప్రధాని మోడీనే ఆడిస్తున్నారు. గవర్నర్లకు ఢిల్లీ నుంచి ఒత్తిడి ఉంది. తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, కేరళలో గవర్నర్లు ఏం చేస్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు. అభివృద్ధి పనులకు అడ్డుతగలడమే గవర్నర్ల పని అన్నట్లుగా ఉంది. స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా దేశం వెనుకబడే ఉంది. మన తర్వాత స్వాతంత్య్రం పొందిన సింగపూర్‌ దూసుకెళ్తోంది. మనమేం పాపం చేసుకున్నామని వెనుకబడిపోతున్నాం. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర స్థితిలో ఉంది. 2024 ఎన్నికల్లో దేశమంతా కలిసి బీజేపీని తరిమికొట్టాలి’ అని కేజ్రీవాల్‌ పిలుపునిచ్చారు.

ఇక పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ సింగ్‌ మాట్లాడుతూ..కంటి వెలుగు ఎంతో ప్ర‌భావంత‌మైన ప‌థ‌క‌మ‌న్నారు. స‌భ‌కు వ‌చ్చిన జ‌నం చూస్తుంటే అద్భుతంగా ఉంద‌ని, ఏవైనా ప్ర‌త్యేక కండ్ల అద్దాలు త‌యారు చేసి ఉంటే, ఇంత జ‌నాన్ని ఆ అద్దాల నుంచి చూసేవాడిని అంటూ భ‌గ‌వంత్ అన్నారు. ఈ దేశం రంగు రంగుల పూల స‌మాహారం అని, కానీ ఒకే పువ్వు ఉండాల‌ని కొంద‌రు చూస్తున్నార‌ని బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీ అబ‌ద్ధాల పార్టీగా మారుతోంద‌న్నారు. ఎమ్మెల్యేల‌ను కొన‌డం, ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం బీజేపీకి అల‌వాటుగా మారింద‌న్నారు. లోక‌తంత్రం కాదు.. లూటీ తంత్రాన్ని బీజేపీ న‌డిపిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు. కానీ స‌మ‌యం అన్నీ నేర్పుతుంద‌ని, రాజుల్ని కూడా అడుక్కునేలా చేస్తుంద‌ని ఆయ‌న బీజేపీకి హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

ఇక సీపీఐ నేత డీ రాజా మాట్లాడుతూ..తెలంగాణలో సుపరిపాలన అందుతోందని, సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభిస్తున్నానని తెలిపారు. విద్యుత్‌ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, నిరంతర కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్‌ మంచి పథకాలు తేవాలని సూచించారు.