కెజిఎఫ్ 2 నుండి అదిరిపోయే వీడియో

యశ్ హీరోగా నటించిన కెజిఎఫ్ ఎంత సంచలనం సృష్టిందో తెలియంది కాదు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ సంస్థ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 250 కోట్లు రాబట్టింది. కన్నడలో వందకోట్లు వసూలు చేసిన ఈ సినిమా హిందీలో 45 కోట్లకు పైగా వసూలు చేసి ఓ సంచలనం సృష్టించింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా అద్భుతమైన వసూళ్లను సాధించింది. కెజిఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సిక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

2018లో ఇదే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన పార్ట్ 1 ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 1’ విడుదలై నేటికి మూడేళ్లయిన నేపథ్యంలో చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-1’ విడుదల తేదీ ప్రకటన దగ్గర నుంచి ‘కేజీఎఫ్‌- చాప్టర్‌2’ విడుదల తేదీ ప్రకటన వరకు చిత్రబృందం చేసిన ప్రయాణాన్ని చూపించారు. అంతేకాదు.. థియేటర్లలో సందడి, చిత్రీకరణ, చిత్రంపై ప్రముఖుల అభిప్రాయం, ప్రేక్షకుల స్పందనలను వీడియో ద్వారా మరోసారి గుర్తు చేశారు. “ఇప్పటికీ మన చుట్టూ ఈలలు, అరుపులు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమ చిత్రంగా ఆదరించిన అభిమానులందరికీ రుణపడి ఉంటాం. ఈ అభిమానమే ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 2’ను తెరకెక్కించడానికి ఇంధనంగా మారింది” అని చిత్రయూనిట్ తెలిపింది. ‘కేజీఎఫ్‌- చాప్టర్‌ 2’ను ఏప్రిల్‌ 14, 2022న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్లు నిర్మాణ సంస్థ హోంబలే ఇటీవల ప్రకటించింది. సంజయ్‌దత్‌, రవీనాటాండన్‌, రావూ రమేష్‌ నటిస్తున్న ఈ చిత్రానికి రవి బస్‌రుర్‌ సంగీతమందించారు.

YouTube video