ఎయిర్‌పోర్టులో చంద్రబాబు కు కేశినేని నాని షాక్..

టీడీపీ అధినేత చంద్రబాబు కు షాక్ ఇచ్చారు ఎంపీ కేశినేని నాని. చంద్రబాబు ఢిల్లీ పర్యటన లో భాగంగా ఈరోజు ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబుకు ఎయిర్‌పోర్టులో ఎంపీలు ఘన స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సత్కరించి పుష్ప గుచ్చం అందించారు. ఈ క్రమంలో ఎంపీ గల్లా జయదేవ్ పుష్ప గుచ్చాన్ని అధినేతకు అందివ్వాలని ఎంపీ కేశినేని నాని చేతికి ఇవ్వబోయారు. కానీ నాని పుష్పగుచ్చాన్ని విసురు కొట్టారు.

దీంతో నాని తీరు చర్చనీయాంశమైంది. అంతేకాదు నాని చంద్రబాబుకు దూరంగా ఉన్నారు. ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబుపై నేరుగా అసహనం ప్రదర్శించారని చర్చించుకుంటున్నారు. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు కేశినేని నిరాకరించడంపై ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది. బొకే ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ బతిమిలాడిన ఏమాత్రం పట్టించుకోలేదు. మీరు ఇవ్వండి అంటూ జయదేవ్ తో సీరియస్ గా చెప్పారు. ఇదంతా చంద్రబాబు సమక్షంలోనే జరిగింది. మొత్తం చూస్తున్న చంద్రబాబు మౌనంగానే ఉన్నారు. అంతకు ముందు ఏయిర్ పోర్టు లాంజ్ వరకు చంద్రబాబుతో గల్లా జయదేవ్ మాట్లాడుతూ వచ్చారు. ఆ సమయంలో పక్కనే ఉన్నా ఎంపీ కేశినేని నాని కొంత అసహనంగా కనిపించారు. దూరంగానే ఉండే ప్రయత్నం చేసారు.

కొద్దిరోజులుగా కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. తన ఎంపీ స్టిక్కర్‌ను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులకు నాని ఫిర్యాదు చేశారు. నేరుగా తమ్ముడు చిన్నిని టార్గెట్ చేశారు. ఈ క్రమంలో నాని తమ్ముడు మరింత దూకుడు పెంచారు. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాను కలిశారు. తన పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో కొన్ని కార్యక్రమాలు చేశారు. ఈ క్రమంలోనే తమ్ముడిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహిస్తోందని నాని అసహనంతో ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

అయితే కేశినేని నాని నివాసంలో తాజాగా ఆయన కుమార్తె వివాహ నిశ్చితార్ధ కార్యక్రమంలోనూ చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఆ సమయంలో చంద్రబాబుతో ఎంపీ నాని సన్నిహితంగానే కనిపించారు. అయితే, ఇప్పుడు ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు వచ్చిన సమయంలో ఈ విధంగా వ్యవహరించటం పైన చర్చ మొదలైంది.