సర్వేపల్లి కుటుంబంలో విషాదం : సర్వేపల్లి మనవడు కన్నుమూత

మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్​ మనవడు, కేంద్ర మాజీ ఆరోగ్య కార్యదర్శి కేశవ్​ దేశి రాజు (66) కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. 1978 బ్యాచ్ ఉత్తరాఖండ్ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన కేశవ్.. కేంద్రంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు. హృదయ సంబంధిత వ్యాధితో (కరోనరీ సిండ్రోమ్) బాధపడుతోన్న కేశవ్.. దేశమంతా సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజు సందర్భంగా టీచర్స్ డే వేడుకలు జరుపుకుంటోన్న వేళ మరణించడం ఆయన కుటుంబాన్నే కాదు యావత్ దేశ ప్రజలను శోకసంద్రంలో పడేసింది.

కేశవ్​ దేశి రాజుకు చాలా నిజాయితీరుడైన అధికారి అనే పేరుంది. రాజీలేని మనస్తత్వం అని ఆయనతో పరిచయం ఉన్న అధికారులు చెబుతారు. 2016లో వచ్చిన మెంటల్ హెల్త్ కేర్ బిల్ వెనక కేశవ్ కీలక పాత్ర పోషించారు. ఆయన పలు పుస్తకాలకు రచయితగా.. మరికొన్నింటికి సహ రచయితగా వ్యవహరించారు. లెజెండరీ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవితం గురించి “గిఫ్టెడ్ వాయిస్: ద లైఫ్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఎం.ఎస్.సుబ్బలక్ష్మి” అనే పుస్తకం రాయడం జరిగింది. కేశవ్ దేశిరాజు మృతి పట్ల రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ జైరామ్ రమేశ్ సహా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.