కాపులకు ఏతరహా రిజర్వేషన్లు కావాలో హరిరామజోగయ్య చెప్పాలి

-ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరావు

Kesana Shankara Rao
Kesana Shankara Rao

Tenali: రాష్ట్రంలో కాపులకు సంబంధించి ఏ తరహా రిజర్వేషన్లు కావాలో ముందుగా కాపు సీనియర్‌ నాయకుడు హరిరామజోగయ్య తేల్చి చెప్పాలని ఎపి బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు అన్నారు.

కాపు సంక్షేమ సేన సంస్ధ ఏర్పడినట్లుగాను,ఆసంస్ధ ఆధ్వర్యంలో కాపులకు విద్య,ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ల కోసం ఉద్యమం నిర్వహించనున్నట్లుగా తాజాగా హరిరామజోయగ్య ప్రకటన చేశారని అన్నారు. ఇక్కడి మీడియాతో మాట్లాడారు.

వెనుకబడిన వర్గాలుగా ఉన్న వారికిఎటువంటి నష్టం కలుగకుండా కాపులను బిసిలుగా ప్రకటించి,లేదా ఓసిలో 10శాతం ఇబిసి కోటాలోని జనాభా ప్రాతిపధికన రిజర్వేషన్లు కల్పించాలని జోగయ్య ప్రకటన విడుదల చేశారని తెలిపారు.

కాపుల్నిగాని మరేఇతర ఆధిపత్య కులాన్నిగానీ బిసిల్లో చేరిస్తే అది నిజమైన సాంఘికంగా వెనుకబడిఉన్న వర్గాలకు ఖచ్చితంగా నష్టమేనని రాష్ట్రంలోని బిసి ఉద్యమం ఆదినుండి స్పష్టంగా చెబుతూనే ఉన్నదని వెల్లడించారు.

మంజునాధన్‌ కమిషన్‌ విచారణ సందర్భంలో కూడా బిసిలంతా ఏక కంఠంతో ఇదే విషయాన్ని 13జిల్లాల్లోనూ తమ వాణి వినిపించారని స్పష్టంచేశారు.

మరోవైపు తాము సాంఘికంగా వెనుకబడి ఉన్నమనే కీలకమైన అంశాన్ని కమీషన్‌ ఎదుట కాపులు సోదాహణంగా వినిపించలేకపోయారని చెప్పారు.

కమీషన్‌ చైర్మన్‌ మంజునాధన్‌ కాపుల కోరికకు అనుకూలంగా నివేదిక ఇవ్వలేదని చెప్పారు.

అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరితంగా ఏదో ఒక చట్టాన్ని తయారుచేసి కాపుల్ని బిసిల్లో చేరుస్తూ వారికి 5శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లుగా ప్రయత్నం చేసినా అది కాస్తా కేంద్రంలో బెడిసి కొట్టిందన్నారు.

తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ కేంద్రం పరిధిలోనిదని పూర్తిగా పక్కన బెట్టారన్నారు.

ఇప్పటి దాకా నాయకత్వం వహించిన ముద్రగడ పద్మనాభం ఉద్యమం నుండి తప్పకున్నట్లు ప్రకటించిన విషయాన్ని కేసన గుర్తుచేశారు.

ఆర్థిక,బలహీనవర్గాల పేరుతో ఆధిపత్య కులాలకు కేంద్రం కల్పించే 10శాతం రిజర్వేషన్లలో కాపులకు 5శాతం కేటాయించాలని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌ డిమాండ్‌ చేసి, ఇపుడు కాపుల్ని బిసిల్లో చేర్చాలనే డిమాండ్‌ను పూర్తిగా పక్కన బెట్టారని తెలిపారు.

తాజాగా కాపు సంక్షేమ సేన నాయకుడుగా హరిరామ జోగయ్య కాపుల్ని బిసిల్లో చేర్చటం, లేదా ఒసిల్లో 10శాతంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారని అన్నారు.

గత టిడిపి ప్రభుత్వం కాపు సామాజిక వర్గం బిసిలా లేక ఈ బిసిలా అనేది తేల్చకుండా రిజర్వేషన్ల అంశం ఎటూ తేల్చకుండా వదిలివేశారని విమర్శించారు.

కాపులు బిసిలా? కాదా? అనే అంశాన్ని గత టిడిపి ప్రభుత్వం తేల్చకుండా వదిలివేసిందన్నారు.

ఇక బిసిలకు సంబంధించిన కాపులకు సాంఘిక వెనుకబాటుతనం లేదు గనుక వారికి బిసి అర్హత లేదనేదే బిసి సంక్షేమ సంఘం స్పష్టమైన వైఖరిగా చెప్పారు.

కాపుల్ని బిసిల్లో చేర్చాలనే జోగయ్య డిమాండ్‌ను గానీ,మరెవరు గానీ లేవనెత్తితే బిసిలు అనివార్యంగా వ్యతిరేకించక తప్పదన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/