పార్టీ సంక్షోభంలో ఉంటే పారిపోతారా..? కాంగ్రెస్ నేత పీజే కురియన్

రాహుల్ పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత పీజే కురియన్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ రాష్ట్ర సీనియర్ నేత పీజే కురియన్, ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కురిపించారు. కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షత వహించేవారు అన్ని వేళలా గాంధీల కుటుంబం నుంచే ఉండడం సరికాదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఓ మళయాళ పత్రికతో మాట్లాడిన సందర్భంగా ఆయన రాహుల్ ను లక్ష్యం చేసుకున్నారు.

‘‘కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా రాహుల్ గాంధీ రాజీనామా చేయడం ఆయనలోని నిలకడలేమికి నిదర్శనం. పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు అధ్యక్షుడిగా ఆయన ముందుండి పోరాడాలి. ఓడ మునిగిపోతుంటే కెప్టెన్ దాన్ని వదిలేసి పారిపోకూడదు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించాలి. దీనికి బదులు ఆయన తన చుట్టూ ఉన్నవారితో కారణాలపై చర్చించారు. ఆయన చుట్టూ ఉన్నది తగినంత అనుభవం లేని వారే. ఓడను విడిచి పెట్టి పారిపోకుండా, రాహుల్ గాంధీ అందరితో చర్చించిన తర్వాత పరిష్కారాన్ని గుర్తించాల్సింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాహుల్ గాంధీ తన బాధ్యతలను వదిలేసిన నాటి నుంచి .. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవి ఖాళీగానే ఉంది. అయినా కానీ, అన్ని విధాన నిర్ణయాలను రాహులే తీసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. పార్టీ అధ్యక్ష పదవి వద్దన్న వ్యక్తే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ బాధ్యతలు మరొకరు చేపట్టేందుకు అనుమతించడం లేదు. ఇది ఆమోదనీయం కాదు’’అంటూ రాహుల్ తీరును కురియన్ తప్పుబట్టారు. రాహుల్ పార్టీ సంస్థాగత ఎన్నికల ద్వారా మరోసారి అధ్యక్షుడు అయితే తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/