కేర‌ళ‌లో మళ్లీ నోరోవైరస్ క‌ల‌క‌లం..

బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందన్న ఆరోగ్య మంత్రి

తిరువనంతపురం : నోరోవైరస్ కేరళలో మళ్లీ వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో రెండు నోరోవైరస్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం నిర్ధారించింది. రాజధాని తిరువనంతపురంలోని వళింజమ్ ప్రాంతంలో ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ను గుర్తించినట్టు తెలిపింది. వేగంగా వ్యాప్తి చెందే ఈ వైరస్ బారినపడిన ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కలుషిత ఆహారం, అతిసార ఫిర్యాదుల నేపథ్యంలో వళింజమ్‌లోని ఎల్‌ఎంఎస్ఎల్‌పీ పాఠశాల విద్యార్థుల నుంచి నమూనాలు సేకరించి, పరీక్షల కోసం పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌కు పంపినట్టు తెలిపారు.

అయితే, నోరోవైరస్ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఆరోగ్య శాఖ అవసరమైన నివారణ చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. కేరళలో తొలిసారి గతేడాది నవంబరులో నోరోవైరస్ తొలి కేసు నమోదైంది. వయనాడులోని వెటర్నరీ కాలేజీకి చెందిన 13 మంది విద్యార్థులు నోరోవైరస్ బారినపడ్డారు. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం నివారణ చర్యలు చేపట్టడంతో అదుపులోకి వచ్చింది. ఆ తర్వాత మళ్లీ కేసులు నమోదు కాలేదు.

ఆహారం లేదంటే కలుషిత ద్రవాల ద్వారా నోరోవైరస్ వ్యాపిస్తుంది. వైరస్ ఉన్న ఉపరితలాలు, వస్తువులను తాకడం ద్వారా కానీ, అది సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడం ద్వారా కానీ ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తులతో శారీరక సంబంధం, శ్వాస, విసర్జనల ద్వారా మిలియన్ల కొద్దీ నోరోవైరస్ కణాలు వ్యాపిస్తాయి. ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడతారు. వైరస్ సోకిన వారిలో వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూడు రోజుల తర్వాత లక్షణాలు తగ్గిపోతాయి. అయితే, కోలుకున్న తర్వాత కూడా రెండు వారాలపాటు అతడి నుంచి వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉంటుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/