దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేత!

కేసులు పెరిగితే ఎదుర్కొనేందుకు సిద్ధమన్న సిఎం అరవింద్ కేజ్రీవాల్

arvind kejriwal
arvind kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ కరోనా లాక్‌డౌన్‌ నిబంధనలను తొలగించేందుకు సిద్ధంగా ఉన్నామని కరోనా వైరస్ తో కలిసి కాపురం చేయాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన, ఢిల్లీలో అన్ని రకాల కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాష్ట్ర పరిధిలో ఇంతవరకూ 4,122 కరోనా కేసులు నమోదైనాయని, 1,256 మంది రికవరీ అయ్యారని, మరో 64 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఢిల్లీలో దశలవారీగా లాక్ డౌన్ ను తొలగిస్తూ వెళ్తామని తెలిపిన ఆయన, కంటైన్ మెంట్ జోన్లలో మాత్రం ఆంక్షలు కొనసాగుతాయని అన్నారు. ఇదే విషయాన్ని తాను కేంద్రానికి కూడా స్పష్టం చేశానని, గ్రీన్ జోన్లలో ఉన్న అన్ని షాపులనూ, సరి బేసి విధానంలో తిరిగి తెరచుకోవచ్చని, ఈ ప్రాంతాల్లో సమీప భవిష్యత్తులో కొన్ని కేసులు పెరిగినా, పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగానే ఉన్నామని స్పష్టం చేశారు. ప్రైవేటు కార్యాలయాల్లో 33 శాతం సిబ్బంది ఉండవచ్చని, ఐటీ హార్డ్ వేర్ సంస్థలు, నిత్యావసర వస్తువుల తయారీ, ప్రాసెసింగ్ కేంద్రాలపై ఆంక్షలుండవని అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/