‘క్రేజ్‌’ తగ్గని కేజ్రీవాల్‌!

వార్తల్లోని వ్యక్తి (ప్రతి సోమవారం)

KEJRIWAL

వరుసగా మూడు జనరల్‌ ఎన్నికలలో అఖండ విజయం! ఇది అంత సులభసాధ్యమైన విషయం కాదు. అయితే, లోగడ షీలాదీక్షిత్‌ హయాంలో కాంగ్రెసుకు సాధ్యమైంది. అప్పటిలో ఆమె మూడు సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు ఆమ్‌ ఆద్మీపార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్‌ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ‘హ్యాట్రిక్‌ కొట్టారు! లోగడ రెండుసార్లు ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఈసారి అంత సులభమని చాలా మంది నమ్మలేదు.
ఎందువల్లనంటే, కిందటి సంవత్సరం జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఢిల్లీలోని ఏడు లోక్‌సభ స్థానాలనూ బిజెపి గెలిచింది! ఆమ్‌ ఆద్మీ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు!
అయినప్పుడు, మొన్న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 70 స్థానాలలో 68 స్థానాలు వస్తాయని ఎవరైనా ఎలా అనుకుంటారు? కాని, అరవింద్‌ కేజ్రీవాల్‌ ‘క్రేజ్‌ తగ్గలేదు.
మహిళలకు భద్రత అందుకు, గడచిన అయిదు సంవత్సరాలలో ఆయన ప్రభుత్వం అనుసరించిన ప్రజాకర్షక విధానాలే కారణం! ముఖ్యంగా ఇటీవల దేశంలో మహిళలకు భద్రతే లేకుండా పోయింది! ‘ఆడది అర్థరాత్రి బయటికి ఒంటరిగా వెళ్లినా, క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని గాంధీజీ అన్న మాటకు అడుగడుగునా పరీక్షా కాలమిది! ఇంటిలో ఉయ్యాల తొట్టిలో పడుకున్న అయిదారు నెలల పసిపాపకు కూడా భద్రత కనిపించడం లేదు!

కాగా, ‘నిర్భయకు జరిగిన ఘోరావమానం ఇంకా ఢిల్లీ ప్రజలు, ఆ మాటకువస్తే, దేశ ప్రజల మనోవీధిలో నాట్యమాడుతూనే వ్ఞంది. ఆ నరహంతకులను ఉరి తీయడానికి మన న్యాయశాస్త్రం వెనుకాముందు ఆలోచిస్తున్నది! ఈ వ్యాసం రాసే సమయానికి ఆ నరరూపరాక్షసులు ‘భద్రంగానే వ్ఞన్నారు!
అలాంటిది కేజ్రీవాల్‌ ప్రభుత్వం బస్సుల్లో మహిళలకు రక్షణ కల్పించడానికి 13వేల మంది మార్షల్స్‌ను నియమించింది. ఢిల్లీలో మూడు లక్షల సిసిటివి కెమెరాలు, రెండు లక్షల వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మహిళల పట్ల సోదరభావంతో వ్యవహరిస్తామని స్కూళ్లలో విద్యార్థులతో ప్రమాణాలు చేయిస్తున్నారు. ఈ నిర్ణయాలు మహిళా ఓటర్లపై సానుకూల ప్రభావం చూపిస్తున్నాయి.

వీటికి తోడు బిజెపి విభజన రాజకీయాల వ్యూహంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పడలేదు. అయితే, అదే సమయంలో జాతీయత విషయంలో రాజీపడబోమని కూడా కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. అయిదేళ్లు అధికారంలో కొనసాగినా, ఆయన ప్రభుత్వానికి అవినీతి మరక అంటలేదు! దీనికితోడు ఢిల్లీ ముస్లింలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి దాదాపు ఏకగ్రీవంగా ఓటేశారు!

ఉచిత పథకాలు

ఢిల్లీలో ఒకప్పుడు విద్యుత్‌ కోతలు, మంచినీటి లోటు తీవ్రంగా వ్ఞండేది! అలాంటిది కేజ్రీవాల్‌ ప్రజలకు 24 గంటలూ ఉచిత విద్యుత్తు, పుష్కలంగా మంచినీరు అందిస్తున్నారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన 400 మొహల్లా క్లినిక్‌లు నిరుపేదలకు వరప్రసాధాలైనాయి. ఇక, విద్యారంగానికి బడ్జెట్టులో 25 శాతం సొమ్మును నాలుగేళ్లుగా కేటాయిస్తూ వచ్చారు! బస్సులోను, మెట్రో రైళ్లలోను విద్యార్థులకు, మహిళలకు ఉచిత ప్రయాణసౌకర్యం కల్పించారు. ఈ సౌకర్యాలతో ఆప్‌కు 53 శాతం పురుష ఓట్లు, 59శాతం మహిళా ఓట్లు పడ్డాయి. ఇక, ఆ పార్టీ గెలవక ఏమౌతుంది?

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబ రావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/