వారం పాటు మునుగోడులో కేసీఆర్ ప్రచారం

ముఖ్యమంత్రి కేసీఆర్ మునుగోడు ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఈ నెల 30న చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తూ..ఇతర పార్టీల నేతలపై విమర్శలు కురిపిస్తున్నారు. ముఖ్యముగా బిజెపి – టిఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తగ్గిదేలే అన్నట్లు ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ తరుణంలో మునుగోడు ప్రచారంలో కేసీఆర్ పాల్గొంటారా..లేదా అనేది ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పార్టీ వర్గం. ఈ నెల 30న మునుగోడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేసీఆర్.. చండూరులో టీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొననున్నారు. వారం రోజులకుపైగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్.. బుధవారం హైదరాబాద్ చేరుకోనున్నారు.

కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ ఎప్పుడో రావాల్సి ఉండగా.. జ్వరం కారణంతో అస్వస్థతకు గురి కావడంతో రెండు రోజులుగా ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసంలో చికిత్స పొందారు. గురువారం నుంచి మునుగోడు ఉపఎన్నికపై కేసీఆర్ దృష్టి పెడతారని తెలుస్తోంది. బహిరంగ సభ నిర్వహణ, ప్రచారపర్వం గురించి నేతలతో చర్చించనున్నారు. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో సీఎంవో అధికారులు పర్యటిస్తున్నారు. కేసీఆర్ బసకి సంబంధించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వారం పాటు మునుగోడులోనే ఉండి కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారని చెబుతున్నారు. అందుకోసం చండూరు, చౌటుప్పల్, మునుగోడు ప్రాంతాల్లో కేసీఆర్ బస చేసేందుకు అధికారులు ఏర్పాట్లలో మునిగిపోయారు.