నేడు స్వయంభూ నారసింహుడికి కిలో 16 తులాల బంగారం సమర్పించబోతున్న సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో యాదాద్రికి బయలుదేరనున్నారు. సతీసమేతంగా వెళ్తున్న ఆయన…. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆలయ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం… కిలో 16 తులాల బంగారాన్ని సమర్పించనున్నారు. ఉదయం 10.30కు ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. మూడు గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4 గంటలకు తిరిగి ప్రగతిభవన్ కు చేరుకోనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ సిద్ధం చేసారు అధికారులు.

పర్యటనలో భాగంగా క్షేత్రంలో జరుగుతున్న వివిధ పనుల పురోగతిని పరిశీలించే అవకాశం ఉంది. ప్రధానాలయ దివ్య విమానగోపురానికి బంగారు తాపడం కోసం విరాళాలు ఇవ్వాలని గతంలో కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ఆ దిశగా ఇప్పటికే చాలామంది ప్రముఖులు, భక్తులు.. స్వామివారికి పుత్తడిని సమమర్పించారు. తానూ కిలో16 తులాల బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు గతంలో ప్రకటించిన కేసీఆర్.. ఆ స్వర్ణాన్ని స్వామికి సమర్పించనున్నారు. జాతీయ పార్టీపై అక్టోబర్ 5న కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం యాదగిరి గుట్ట పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. దసరా కంటే ముందే సిద్ధిపేటలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామిని కేసీఆర్ దర్శించుకునే అవకాశం ఉంది.