మరికొద్ది సేపట్లో ఢిల్లీలో తెరాస పార్టీ కార్యాలయం భూమి పూజ

ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాల‌య నిర్మాణానికి గురువారం మధ్యాహ్నం 1.48 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ప్రాంతీయ పార్టీగా మొదలైన గులాబీ ప్రస్థానం.. హస్తిన వరకూ చేరుకుంటోంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అధికారాన్ని చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. దేశ రాజధానిలో పార్టీ భవనాన్ని నిర్మించుకోబోతుంది.

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2021, సెప్టెంబర్ 02వ తేదీ గురువారం శంకుస్థాపన జరగబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాల్లోని ఏ పార్టీకి లేని విధంగా ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీకి శాశ్వత భవన నిర్మాణం కాబోతుంది. ద్వి దశాబ్ది వేడుకలను పూర్తిచేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ పార్టీ తన భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి పదునుపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. 2020 అక్టోబర్‌ 9న 11 వందల చదరపు మీటర్ల భూమిని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి కేంద్రం కేటాయించింది. పార్టీ ఆఫీస్‌ భూమి కోసం టీఆర్‌ఎస్‌ 8 కోట్ల రూపాయలను కేంద్రానికి చెల్లించింది. కాగా 40 కోట్ల అంచనా వ్యయంతో పార్టీ భవన్‌ను నిర్మిస్తున్నారు. మీటింగ్‌ హాల్‌తో పాటు రాష్ట్రం నుంచి వివిధ పనుల మీద వచ్చేవారు స్టే చేసేందుకు అన్ని సౌకర్యాలు ఉండేలా భవన నిర్మాణానికి డిజైన్ చేశారు.

ఇక భూమిపూజ కార్య క్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిపి సుమారు 500 మందికి పైగా నేతలు, కార్యకర్తలు పూజాకార్యక్రమంలో పాల్గొననున్నారు. అతిధుల కోసం ప్రత్యేక స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ వర్షాలు పడుతుండటంతో ఇబ్బందులు కలగకుండా.. రెయిన్‌ ప్రూఫ్ షెడ్ ఏర్పాటు చేశారు.