కేసీఆర్ జాతీయ పార్టీ పేరు ‘భారత్‌ రాష్ట్రీయ సమితి’ ?

టిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల ఫై ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. త్వరలో రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ పార్టీ ని ప్రకటించాలని డిసైడ్ అయ్యారు. ఈ నెలాఖరులో దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్టీను కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. పార్టీ పేరును ‘భారత్‌ రాష్ట్రీయ సమితి’ అని డిసైడ్ చేసినట్లు వినికిడి. అందుబాటులో ఉన్న మంత్రులు, ఎంపీలు, ఇతర నేతలతో నిన్న ప్రగతి భవన్‌లో ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశంలో దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్రపైనా చర్చ జరిగింది. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో మనం కీలక పాత్ర పోషిద్దామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.

విపక్ష హోదాలో కాంగ్రెస్ విఫలమైనందున దేశ ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడిందని సీఎం అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలని.. వివిధ పార్టీలను ఏకం చేసి ఎన్డీయే అభ్యర్థిని ఓడించడం ద్వారా బీజేపీకి తగిన గుణపాఠం చెప్పవచ్చని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. అంతకుముందు సమావేశంలో టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినప్పటికీ.. కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

ఇక నిన్న జరిగిన సమావేశంలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, హరీశ్‌ రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, సబితారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్‌, సత్యవతి రాథోడ్‌, నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్, లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్‌, సంతోష్‌ కుమార్‌, రవి చంద్ర, దామోదర్‌రావు, శాసనసభ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, ఎమ్మెస్‌ ప్రభాకర్‌రావు, గువ్వల బాలరాజు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

ఇక రాష్ట్రపతి ఎన్నిక‌‌‌‌కు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. జులై 18న పోలింగ్​ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 15న ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌ నోటిఫికేష‌‌‌‌న్ విడుద‌‌‌‌లవుతుందని చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ తెలిపారు. నామినేష‌‌‌‌న్ దాఖ‌‌‌‌లుకు చివ‌‌‌‌రి తేదీ జూన్ 29. నామినేష‌‌‌‌న్ల ప‌‌‌‌రిశీల‌‌‌‌న జూన్ 30 న జ‌‌‌‌రుగుతుంది. నామినేష‌‌‌‌న్ల ఉప సంహ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు జులై 2 వ‌‌‌‌ర‌‌‌‌కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించారు. జులై 21న ఢిల్లీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జులై 18న పార్లమెంటులో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీల్లో ఓటు వేయవచ్చని, అయితే ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాజీవ్​ కుమార్​ పేర్కొన్నారు.