బిగ్ బ్రేకింగ్: కేసీఆర్‌కు కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి రోజురోజుకూ తన పంజా విసురుతూ జనాలను భయాందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ యావత్ భారతదేశాన్ని గజగజ వణికిస్తోండగా, పెద్ద సంఖ్యలో జనాలు ఈ వైరస్ బారిన పడుతున్నారు. సామాన్య ప్రజల నుండి ప్రముఖుల వరకు ఈ వైరస్ బారిన పడుతుండటంతో ప్రభుత్వ అధికారులతో పాటు అందరూ అప్రమత్తం అవుతున్నారు. కాగా తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కరోనా బారిన పడ్డారు.

ఇటీవల పలు సమావేశాల్లో పాల్గొన్న కేసీఆర్ చాలా చురుగ్గా కనిపించారు. కాగా తాజాగా కేసీఆర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. ఈ మేరకు వారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కేసీఆర్‌కు కరోనా పరీక్ష నిర్వహించగా, ఆయనకు పాజిటివ్ అని తేలిందని వారు తెలిపారు. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలంగాణ సీఎస్ తెలిపారు. కేసీఆర్‌కు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా ప్రభుత్వ యంత్రాంగం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

కేసీఆర్‌కు కరోనా సోకిందని తెలిసిన పలువురు ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయన త్వరగా కోలుకోవాలని కోరారు. కాగా ప్రభుత్వం కరోనా విజృంభనను దృష్టిలో పెట్టుకుని ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. అటు దేశ రాజధాని ఢిల్లీలో నేటి రాత్రి నుండి లాక్‌డౌన్ విధించడంతో, తెలంగాణలో కూడా లాక్‌డౌన్ ఉంటుంది అనే ఊహాగానాలు ప్రజల్లో జోరుగా వినిపిస్తున్నాయి.