కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందన్న కేసీఆర్

కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. రంజాన్‌ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఎల్బీస్టేడియంలో ఇఫ్తార్‌ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజ‌ర‌య్యారు. సీఎంతో పాటు మంత్రులు మ‌హ‌మూద్ అలీ, త‌ల‌సాని శ్రీనివాస్, స‌త్య‌వ‌తి రాథోడ్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముస్లిం మత పెద్ద‌లు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. స్వరాష్ట్రం వచ్చినప్పుడు రాష్ట్రంలో తెలంగాణ నీళ్లు లేవు, కరెంట్ లేదన్నారు. చాలా దుర్భర పరిస్థితి లు ఉండే తెలంగాణ అని ఆయన అన్నారు. అల్లా, భగవంతుని దయ వల్ల మీ సహకారం వల్ల అధిగమించామన్నారు. అయితే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలకు సహకారం అందించాలని.. కానీ.. కేంద్ర ప్రభుత్వానికి రోగం సోకిందన్నారు. భార‌త దేశం మొత్తం నేడు అంధ‌కారంలో వుంది. కానీ తెలంగాణ మాత్రం విద్యుత్ కాంతుల‌తో విరాజిల్లుతోంది. తాగేనీరు గానీ, వ్య‌వ‌సాయం గానీ, పండే పంట‌లో కూడా తెలంగాణ మంచి ఫ‌లితాల‌ను సాధించింది. మైనారిటీ పిల్ల‌ల కోసం అద్భుత‌మైన రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌ల‌ను నిర్మించాం. అన్ని వ‌స‌తులూ క‌ల్పించాం.

తెలంగాణ ప్ర‌భుత్వం చేసిన తీరుగానే.. దేశం మొత్తం కూడా ఇదే విధానాన్ని అవ‌లంబించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. అంతేకాకుండా రాజకీయ లబ్దికోసం ప్రస్తుతం దేశంలో మత విద్వేషాలు రగుల్చుతున్నారన్నారు. అయితే అది మాత్రం తెలంగాణలో సాధ్యం కాదని.. అలాంటి మత విద్వేషలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.